
రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలోని ప్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సినీ హీరో నాగార్జున, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. సదస్సుకు ముందు రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరివీలించారు. అనంతరం తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. “ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది .2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగం. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్నిరంగాల్లో తెలంగాణ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తెలంగాణ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తుంది. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నాం. బస్సుల నిర్వహణను కూడా మహిళా సంఘాలకు ఇచ్చాం. మాది స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వం. ఆవిష్కరణల్లో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుంది. విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్ల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం” అని అన్నారు.
కాగా ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు,. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రసంగించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రారంభోత్సవ సమావేశం ముగియగానే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పులు, అభివృద్ది ప్రణాళికలపై చర్చిస్తున్నారు. సమ్మిట్ ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసి హాళ్లల్లో ప్యానల్ డిస్కషన్స్ నిర్వహిస్తున్నారు. తొలిరోజు 12 అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు. సంబంధిత శాఖల ఆధ్వర్యంలో నిపుణులు, మేధావులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు,. రాష్ట్ర భవిష్యత్తు, గ్రీన్ ఎనర్జీ దిశలో మందడుగుపై తొలి రోజు చర్చించనున్నారు.