Hyderabad: గీతం విద్యార్థిని అరుదైన ఘనత.. ఏకంగా 23 గిన్నిస్​ వరల్డ్‌ రికార్డులు కైవసం

ఒకటి కాదు రెండు కాదు ఆమె ఏకంగా 23 గిన్నిస్​ వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది. కాగితాలను అందమైన ఆకృతులుగా మార్చే నైపుణ్యంతో ఈ ఘనత సాధించారు గీతం కాలేజ్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ. ఎంచుకున్న అంశంలో పూర్తిస్థాయిలో కృషి చేస్తే, ఏ స్థాయిలో ఫలితాలు దక్కించుకోవచ్చనేందుకు ఆమె ఉదాహరణగా నిలుస్తున్నారు.

Hyderabad: గీతం విద్యార్థిని అరుదైన ఘనత.. ఏకంగా 23 గిన్నిస్​ వరల్డ్‌ రికార్డులు కైవసం
GITAM alumna Shivali Johri Srivastava origami displays

Edited By:

Updated on: Jan 25, 2026 | 11:15 AM

హైదరాబాద్, జనవరి 25: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శివాలి జోహ్రి శ్రీవాస్తవ సీఎస్​ఈ చదివారు. 2020లో ఇక్కడ ఆమెకు విద్యాభ్యాసం పూర్తయింది. ఇక్కడ చదువుకునేప్పటి నుంచే ఆమె ఓరిగామి కళలో తన ప్రతిభను చాటుతూ వచ్చింది. గీతం ప్రొఫెసర్లు, యాజమాన్యం కూడా ఆమెకు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలిచారు. తాజాగా ఆమె రెండు గిన్నిస్​ వరల్డ్​ రికార్డులు సాధించారు. దీంతో మొత్తం 23 గిన్నిస్​ వరల్డ్​ రికార్డులను తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఈ విజయాలతో దేశంలోనే అతి ఎక్కువ గిన్నిస్​ వరల్డ్ రికార్డులున్న వ్యక్తిగా ఘనత సొంతం చేసుకున్నారు. తన తల్లిదండ్రులు కవితా జోహ్రి శ్రీవాస్తవ, అనిల్​ శ్రీవాస్తవలతో కలిసి శివాలి అద్బుతం చేశారు. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి ప్రదర్శన చేసి కొత్తగా రెండు గిన్నిస్​ వరల్డ్​ రికార్డులను దక్కించు కున్నారు. ఈ ప్రదర్శనలో కాగితాలతో 4,700 కుందేళ్లు, 3,500 తాబేళ్లు రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇప్పటివరకు 23 గిన్నిస్ రికార్డులతో పాటు 15 అసిస్ట్, 15 యూనిక్ వరల్డ్ రికార్డులు ఆమె ఖాతాలో జమయ్యాయి.

గతంలో శివాలి 21 గిన్నిస్ రికార్డులు సాధించారు. వాటిలో 1,251 చేతితో తయారు చేసిన కాగితపు బొమ్మలు, 7,011 క్విల్డ్ పువ్వులు, 2,111 పేపర్ క్విల్డ్ బొమ్మలు, 6,132 ఓరిగారి సిట్రస్ పండ్లు, 6,500 ఓరిగామి గబ్బిలాలు, 6,001 ఓరిగామి తిమింగలాలు, 2,100 పెంగ్విన్లు, 6,132 సిట్రస్ పండ్లు, 6,001 తిమింగలాలు, 2,500 పెంగ్విన్లు, 1,993 మాపుల్ పత్రాలు, 6,500 గబ్బిలాలు, 5,500 కార్లు, 3,400 డైనోసార్లు, 1,900 కుక్కలు, 3,400 నెమళ్లు, 3,200 పందులు, 4,400 చొక్కాలు, 2,200 క్విల్డ్ బొమ్మలు, 3,200 సీల్స్, 3,400 రిబ్బన్ టైలు వంటివి ఉన్నాయి. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, గణిత శాస్త్ర ఆచార్యుడు డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు.. శివాలి అసాధారణ విజయాలను ప్రశంసించి, అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.