తహసీల్దార్ బదిలీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఇష్యూ మాత్రమేనని, ట్రాన్స్‌ఫర్‌తో తనకు సంబంధమే లేదని తేల్చిచెప్పారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. షేక్‌పేట తహశీల్దార్ బదిలీ వ్యవహారంలో వస్తున్న విమర్శలపై ఆమె రియాక్ట్ అయ్యారు. తహసీల్దార్‌ను ట్రాన్స్‌ఫర్ చేయమని ఎవరికీ చెప్పలేదన్న మేయర్.. తహసీల్దార్‌పై కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వ్యవహారమని తేల్చేశారు మేయర్ విజయలక్ష్మి.
విజయలక్ష్మి మేయర్‌గా బాధ్యతలు తీసుకున్నరెండు రోజులకే తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని ట్రాన్స్‌ఫర్ చేయడం సంచలనం రేపింది. ఎలాంటి కారణాలు లేకుండా.. గతంలో జరిగిన గొడవల్ని దృష్టిలో ఉంచుకునే మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పరిధిలో తాను అడిగినట్లు క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో విజయలక్ష్మి.. శ్రీనివాసరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తహసీల్దార్‌ను విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను కోర్టుకు వెళ్లే సమయంలో అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారని గద్వాల విజయలక్ష్మిపై శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు దృష్టిలోపెట్టుకునే ఆమె, శ్రీనివాస్‌రెడ్డిపై బదిలీ వేటు వేశారన్నవి తాజా ఆరోపణలు. శ్రీనివాసరెడ్డి స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్ కె.వెంకట్ రెడ్డిని నియమించారు. ఈ వివాదంపై స్పందించిన విజయలక్ష్మి ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.