Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. తుది పూజల అనంతరం గణనాథుడిని మరి కాసేపట్లో ట్రాలీపైకి ఎక్కించనున్నారు. ఖైరతాబాద్ భారీ గణనాధుడి నిమజ్జనం కోసం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసి తరిస్తారు.
తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని.. అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ మహాగణపతి నిమజ్జనం కానుంది.
67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని తయారు చేసింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్ట్ ఆదేశించింది. అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలనే సందేశాన్ని చెప్తూ.. ఈ సారి ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహానికి స్వస్తి పలికింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది.