ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. రాబోయే 3 నెలలు కష్టమే..?

El Nino 2026 effect: ప్రకృతి ప్రకోపానికి ఎల్ నినో ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఒకే సమయంలో ఒకచోట కరవు, మరోచోట ముంపు నగరాలను వణికించబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో నివసించే ప్రజలు రాబోయే నీటి ఎద్దడిని తట్టుకునేలా ఇప్పటి నుంచే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎల్ నినో గుప్పిట్లో హైదరాబాద్, ఢిల్లీ.. ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. రాబోయే 3 నెలలు కష్టమే..?
El Nino 2026 Effect Hyderabad Delhi

Updated on: Jun 08, 2026 | 9:05 AM

El Nino 2026 effect: ఈ వేసవిలో ఒకే ఆకాశం వైపు చూసే రెండు వేర్వేరు నగరాలు భిన్నమైన విధిని ఎదుర్కోబోతున్నాయి. ఒక నగరం చుక్క వర్షం కోసం అల్లాడిపోతుంటే, మరో నగరం జలమయమైపోనుంది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ‘ఎల్ నినో’ విపత్తు ప్రపంచ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తోందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ (WMO) సంచలన హెచ్చరికలు జారీ చేసింది.

పసిఫిక్ మహాసముద్రానికి జ్వరం.. ఎందుకీ పరిస్థితి?

ప్రపంచ వాతావరణ గమనాన్ని శాసించే పసిఫిక్ మహాసముద్రం ప్రస్తుతం తీవ్రమైన ఉష్ణోగ్రతతో రగిలిపోతోంది. దీనినే శాస్త్రవేత్తలు ‘ఎల్ నినో’ లేదా ‘ఎన్సో’ (ENSO) ఉష్ణ దశగా పిలుస్తారు. పసిఫిక్ మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఈ వేడి కారణంగా వర్షాన్ని మోసుకెళ్లే గాలుల దిశ మారిపోతుంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల నుంచి మేఘాలు పూర్తిగా దూరమైపోతుంటే, మరికొన్ని ప్రాంతాలపైనే కేంద్రీకృతమై ముంచెత్తుతున్నాయి. ‘నినో 3.4 ఇండెక్స్’ ప్రకారం ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ దాటితేనే ప్రమాదకరం. అయితే ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఇది ఏకంగా 1.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోనుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

వాన కోసం తల్లడిల్లబోతున్న భారత నగరాలు..

భారతదేశం ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన పొడి వాతావరణాన్ని, కరవు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) సమాచారంతో కూడిన అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఈసారి దేశంలో సాధారణం కంటే చాలా తక్కువగా, అంటే కేవలం 90 శాతం మాత్రమే రుతుపవన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో వర్షాలు ముఖం చాటేయనున్నాయి. కేవలం ఈశాన్య భారత ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి కొంతవరకు తప్పించుకోగలవని అంచనా. కేవలం భారత్‌లోనే కాదు.. ఆఫ్రికాలోని అడిస్ అబాబా, లాగోస్, బ్రెజిల్‌లోని రెసిఫె, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాలు కూడా చుక్క వాన కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.

అక్కడ మాత్రం కుండపోత వర్షాలు..

ఎల్ నినో అంటే ప్రపంచవ్యాప్తంగా వర్షాలు ఆగిపోవడం కాదు.. వర్షం పడే ప్రాంతాలు మారిపోవడం. భూమిపై ఒకవైపు కరవు తాండవిస్తుంటే, మరోవైపు కొన్ని నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకోనున్నాయి. సాధారణంగా అత్యంత పొడిగా ఉండే ఈక్వెడార్ తీర ప్రాంతాల్లో ఈసారి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, హరారే వంటి నగరాల్లో శీతాకాలంలో ఊహించని రీతిలో రికార్డు స్థాయి కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తక్షణ చర్యలు అవసరం: వాతావరణ సంస్థ హెచ్చరిక..

“ఎల్ నినో ప్రభావం కేవలం పసిఫిక్ సముద్రానికే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల ఆహార భద్రతను, తాగునీటి లభ్యతను, జీవనోపాధిని దెబ్బతీస్తుంది” అని అంతర్జాతీయ వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలలు ప్రపంచంలోని వివిధ నగరాలకు అత్యంత కీలకమైనవి. ప్రభుత్వాలు ఇప్పటి నుంచే నీటి సంరక్షణ, కరవు నివారణ చర్యలు చేపట్టకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు.

వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు..

కాగా, నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరం వెంబడి, అంతర్గత ద్వీపకల్పంలోకి చకచకా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే గోవా మొత్తాన్ని చుట్టేసిన ఈ పవనాలు.. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. తమిళనాడులోని మెజారిటీ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్‌లలో కూడా ఇవి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం మహారాష్ట్రలోని దేవ్‌గఢ్, కర్ణాటకలోని కొప్పల్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మీదుగా చెన్నై, ఐజ్వాల్ వరకు సాగుతోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి పూర్తిగా విస్తరించడానికి వాతావరణం ఎంతగానో అనుకూలంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా దట్టమైన కారుమేఘాలు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి ఇవి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. భానుడి భగభగలకు అల్లాడిన భూమి, ఈ మేఘాల రాకతో చల్లబడనుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ముందస్తు వర్షాలు కూడా మొదలయ్యాయి.

రైతు గుండెల్లో ‘ఎల్ నినో’ వణుకు..

రుతుపవనాల రాక సంతోషాన్నిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ వాతావరణ సూచీలు ఇస్తున్న సంకేతాలు శాస్త్రవేత్తలను, వ్యవసాయ రంగ నిపుణులను కలవరపెడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు రోజురోజుకూ బలపడుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం గనుక పెరిగితే, అది రుతుపవనాల తీవ్రతను తగ్గించి, దేశంలో వర్షపాతాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

సాధారణంగా ఎల్ నినో కాలంలో రుతుపవనాలు సకాలంలో వచ్చినప్పటికీ, మధ్యలో సుదీర్ఘ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది విత్తనాలు వేసి ఆశగా ఎదురుచూసే రైతులకు పెద్ద శాపంగా మారుతుంది. ముఖ్యంగా వర్షాధార పంటలపై ఆధారపడే మెజారిటీ భారతీయ వ్యవసాయ రంగానికి ఇది గండంగా మారే అవకాశం ఉంది.

రుతుపవనాల ముందడుగు ప్రస్తుతానికి ఊరటనిస్తున్నా, ముంచుకొస్తున్న ఎల్ నినో ముప్పును తక్కువగా అంచనా వేయలేం. రాబోయే రోజుల్లో వర్షాల విస్తరణ, వాటి తీవ్రతను బట్టే ఈ ఏడాది దేశ వ్యవసాయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రైతాంగం వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తదనుగుణంగా పంటల ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అత్యంత అవసరం.

మరిన్ని వాతావరణ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us