
తెలుగు రాష్ట్రాల్లో చలిపులి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీ స్ధాయిలో పడిపోవడంతో చలికి జనం వణికిపోతున్నారు. రాత్రి, ఉదయం టెంపరేచర్ ఊహించని రీతిలో తగ్గిపోతుంది. దీంతో చలి దెబ్బకు ఈ సమయాల్లో జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప చలి నుంచి తప్పించుకునేందుకు ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో ఉదయం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోగా.. తెలంగాణలోనూ అదే తరహా పరిస్థితి నెలకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో శనివారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత పదేళ్లల్లో ఇదే అతిపెద్ద రికార్డుగా చెబుతున్నారు. ఇక కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే రెండు రోజుల పాటు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు చలి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ఇక హైదరాబాద్‌లో చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో నగరవాసులు వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల స్థాయికి తగ్గిపోతున్నాయి. శనివారం శేరలింగంపల్లిలో 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. మల్కాజ్‌గిరిలో 8.3 డిగ్రీలుగా రికార్డ్ అయింది. ఇక రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్ల వాతావరణశాఖ గణాంకాలు విడదుల చేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక రాత్రి, ఉదయం వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం వేళల్లో కూడా చలి వదిలిపెట్టడం లేదు. మధ్యాహ్నం సమయంలో కూడా చలితో నగరవాసులు జంకుతున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని ప్రజలను వాతావరణశాఖ అలర్ట్ చేసింది.