Road Accidents : ఈ రోడ్లలో ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఏదో టైమ్ లో యాక్సిడెంట్ గ్యారంటీ. ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. ఈ మాటలు ఆషామాషీగా అంటున్నవి కావు.. రోడ్ ఇంజనీరింగ్ పరిశోధనలు తేల్చిన వాస్తవాలివి. హైదారాబాద్‌లో కొన్ని రోడ్లలో రోడ్ జామెట్రీ లోపాలున్నాయి. అవి ఒకటి రెండూ కాదు.. ఏకంగా 180 కిలోమీటర్లకు పైగా రోడ్లలో లోపాలున్నాయి. అందుకే.. ఈరోడ్లలో చినుకుపడితే స్కిడ్ అవుతారు. కొంచెం స్పీడ్ వెళితే అదుపు తప్పడం గ్యారంటీ.
ఇప్పటి వరకూ.. డ్రైవింగ్ సరిగా రాకపోతేనో.. వాహన కండీషన్ సక్రమంగా లేకపోతేనో .. యాక్సిడెంట్లు జరుగుతాయనుకున్నాం. కానీ ఈ రోడ్లు.. నిజంగానే మాయా రహదారులు. ఇక్కడ వేగంతో పనిలేదు.. వాహనం కండీషన్ తో అసలే పనిలేదు. ఏదో ఒక రూపంలో యాక్సిడెంట్లకు ఈ రోడ్లు కేరాఫ్ అడ్రస్. హైదరాబాద్ లోని అన్ని రోడ్లపైనా జెఎన్ టియు ఇంజనీరింగ్ విభాగం పరిశోధన చేసింది. ఇందులో 180కి పైగా రోడ్లలో రోడ్ డిజైనింగ్ జామెట్రీ లోపాలున్నాయని గుర్తించింది. ముఖ్యంగా మలుపులు.. జంక్షన్లు వెరీ డేంజర్ అని తేల్చింది. వీటితో జాగ్రత్త అని హెచ్చరిస్తోంది.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అల్వాల్ జంక్షన్ కు వెళ్లే మార్గం. ఇది విఐపీ జోన్ రోడ్. ఈ రోడ్డులో ఉన్న ఎత్తుపల్లాలు.. డేంజర్ మలుపులు.. ప్రమాదకర రోడ్డుగా మార్చేశాయి. ప్రతి సంవత్సరం.. కనీసం 10 భారీ యాక్సిడెంట్లు ఈ రోడ్డులో జరుగుతాయి. అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక జూబ్లీ చెక్ పోస్టు నుంచి.. పంజాగుట్ట వెళ్లే రోడ్ పేరు చెబితేనే యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్ అంటారు. రోడ్ డిజైనింగ్‌లో ఉన్న లోపాలు కూడా.. ఇందుకు ప్రధాన కారణమని పరిశోధనలు తేల్చేస్తున్నాయి.
గచ్చిబౌలిలోని మైండ్ స్పేస్ సెంటర్.. కూడా మృత్యు వాకిలిగా మారుతోంది. నాలుగు రోడ్ల నుంచి వచ్చే వాహనాలు ఈ జంక్షన్‌కు వచ్చే సరిగా ఆచితూచి వెళ్లాల్సిందే. లేకుంటే.. అంతే సంగతులు. ఈజంక్షన్ లో అనేక లోపాలు ఉన్నాయి. సిగ్నల్ మీదుగా క్రాస్ చేసి వెళ్లేటప్పుడే కాదు.. ఫ్రీ లెప్ట్, యూ టర్న్ తీసుకునేప్పుడు కూడా బీ కేర్‌గా ఉండాల్సిందే. లేదంటే.. యాక్సిడెంట్స్ జరిగిపోతాయి.
పంజాగుట్టకు ఆనుకుని ఉన్న నాగార్జున సర్కిల్ అంటే.. ఒక పద్మవ్యూహం. ఉదయం నుంచి రాత్రి వరకు బీట్ కానిస్టేబుల్స్ ఒక్క క్షణం చూడకపోతే.. యాక్సిడెంట్ గ్యారంటీ. ఎందుకంటే.. ఇక్కడ జంక్షన్ రోడ్ డిజైన్ అలా ఉంది మరి. ఇవే కాకుండా నగరంలో చాలా చోట్ల యూ టర్న్‌లు మరింత డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నాయి.
యూసఫ్ గూడ్ నుంచి మైత్రీవనంకు వెళ్లే మార్గం.. మోస్ట్ డేంజర్‌గా మారుతోంది. ఇక్కడ ఎంత తప్పించుకుందామన్నా సాధ్యం కాదనే చెప్పాలి. ఎంత జాగ్రత్తగా వెళ్లినా.. ఘోర ప్రమాదం జరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. మరి ఇలాంటి రోడ్లతో ప్రయాణం ఎలా… లక్షల వాహనాల సురక్షితంగా ఎలా గమ్యస్థానాలకు చేరుతాయన్నది ఇప్పుడు ముందున్న పెద్ద ప్రశ్న.
అసలు మనం ఎంత జాగ్రత్త ఉన్నా యాక్సిడెంట్లు ఎలా అవుతాయి? రోడ్ జామెట్రీ లోపాలు… వాహనాల ప్రయాణంపై ఎలా పడతాయి? అవి ప్రమాదంగా ఎలా మారతాయి? జెఎన్ టియూ చేసిన పరిశోధన ఏంటి? వీటిని సరిచేసుకునే మార్గాలేంటి? అనేదానిపై అధ్యయనం చేసిన ఇంజనీరింగ్ నిపుణులు, జేఎన్‌టియు హైదరాబాద్ డైరెక్టర్ అండ్ ఛీఫ్ ఇంజనీర్ ప్రొఫెసర్ లక్షణరావు టీవీ 9తో అనేక విషయాలు పంచుకున్నారు.