భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ముందు వరసలో ఉంటుంది. పండుగ కారణంగా కొత్త వస్తువులు, బంగారం, దుస్తులు.. ఇలా కొనుగోళ్లతో సందడిగా ఉంటాయి. ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని పలు షాపింగ్ మాళ్లు, ఈ కామర్స్ సైట్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ప్రత్యేక రాయితీలు ఇస్తూ ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో పేమెంట్స్ చేసేందుకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు అందుకు సంబంధించిన స్కానర్లనూ సంస్థలు పంపిస్తుంటాయి. వాటిని స్కాన్ చేస్తే వస్తువుకు తగిన ధర మన ఖాతా నుంచి కట్ అవుతుంది. అయితే ఇదే సమయంలో మోసాలూ జరుగుతున్నాయి. స్కానర్ల ద్వారా ఉన్న సొమ్మంతా లాగేస్తున్నారు. చివరకు మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తుంటారు. అలా మోసపోకుండా ఉండాలంటే అలర్ట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఉచితంగా దీపావళి బహుమతుల పేరుతో మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారు. అందుకే అలాంటి మెసేజ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వార్నింగ్ ఇస్తోంది.
ఫెస్టివల్ ఆఫర్స్, గిఫ్ట్స్, బహుమతుల పేరుతో మెసేజ్ లింక్స్‌ను పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేస్తే యూజర్ల పర్సనల్ డేటా, బ్యాంకింగ్ సమాచారం అంతా సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది. కొన్ని సందర్భాల్లో చైనాకు చెందిన వెబ్‌సైట్‌లకు లింక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే బహుమతులను పొందేందుకు అమాయకంగా ప్రజలు వాటికి ఆకర్షితులవుతారు. వినియోగదారు లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, అతనికి బహుమతి గెలుచుకున్నట్లు మెసేజ్ వస్తుంది. నిజమని నమ్మి, వ్యక్తిగత వివరాలు ఇచ్చేస్తారు. అలా నింపిన తర్వాత, బహుమతిని క్లెయిమ్ కోసం ఆ లింక్ ఉన్న మెసేజ్లను వారి స్నేహితులు, బంధువులతో పంచుకోవాలని అప్పుడే గిఫ్ట్ పొందగలరని చూపిస్తుంది. అలా పంపిస్తున్న సమయంలో యూజర్ల వ్యక్తిగత డేటా, అకౌంట్ లో బ్యాలెన్స్ మొత్తం సైబర్ దాడి గురయ్యే అవకాశం ఉంది.
ఈ తరహా స్కామ్‌లను నివారించేందుకు, బహామతులు, రుణాల పేరుతో అనధికారికంగా వచ్చే లింక్‌ల పట్ల జాగ్రత్తగా వహించాలని అధికారులు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. ఫోన్ కు మెసేజ్ రాగానే ఆ లింక్ నిజమా కాదా అని నిర్ధరించుకోవాలి. ఏ మాత్రం సందేహం ఉన్నా క్లిక్ చేయడం మానుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్సనల్ డేటాను బహిర్గతం చేయకూడదు.