ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం.. తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమన్న కాంగ్రెస్‌

కాంగ్రెస్  సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ భవిష్యత్ కార్యచరణపై మేధోమథనం చేసింది. తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.  కాంగ్రెస్‌కు ఓటేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు ఇవ్వనుంది.  మహిళలు, రైతులు, రైతు కూలీలు, యువత, వృద్ధులకు వరాలు ప్రకటించబోతుంది.  కర్నాటక మోడల్‌తోనే తెలంగాణలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 

ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం.. తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమన్న కాంగ్రెస్‌
Sonia Gandhi - Mallikarjun Kharge

Updated on: Sep 17, 2023 | 3:58 PM

రెండు రోజులుగా హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణా హోటల్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి CWC సమావేశం ముగిసింది. తెంలగాణ సహ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ రెండు రోజుల సమావేశంలో లోతైన చర్చ జరిగిందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. బంగారు తెలంగాణ ఆశలను BRS చిదిమేసిందని, ఆ ఆశలను తిరిగి జ్వలింపజేయాల్సిన అవసరం ఉందంటూ CWC తెలంగాణ ప్రజలకు ఒక విన్నపం చేసింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను కోరింది.

కర్నాటక తరహా విధానంతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ ప్రస్తావించింది. ఉత్త హామీలు కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇవ్వదని స్పష్టం చేసింది. తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ ప్రకటించింది. కర్నాటకలో ఇచ్చిన ఐదు హామీలకు మరొకటి జత చేసి ఆరు హామీలను తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చింది.

మహిళలు, రైతులు, రైతుకూలీలు, యువత, వృద్ధులు లక్ష్యంగా ఆరు గ్యారెంటీల కింద మొత్తం 10 హామీలు కాంగ్రెస్‌ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, కుటుంబంలోని మహిళలకు ప్రతీ నెలా 2500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అలాగే గృహజ్యోతి పథకం కింద గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా రైతులకు ఏటా 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఏటా 15 వేల రూపాయలు, వీటికి తోడు వరి పంటకు క్వింటాల్‌కు 500 రూపాయలు రైతులకు బోనస్‌గా అందిస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అందిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. చేయూత పేరుతో చేపట్టే పథకంలో వృద్ధులకు 4 వేల రూపాయల పెన్షన్‌ అందిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..