Greater Hyderabad RTC: కరోనా వైరస్ వ్యాప్తి పుణ్యమాని ఆర్టీసీకి పెద్ద కష్టమొచ్చింది. ప్రగతి రథ చక్రాలు పరుగులు పెట్టలేకపోతున్నాయి. కరోనా సెకండ్‌వేవ్ ఎఫెక్ట్ గ్రేటర్ ఆర్టీసీపై భారీగా పడింది. మార్చి వరకు బస్సుల్లో రోజూ 20 లక్షల మందికిపైగా ప్రయాణాలు సాగిస్తే ఏప్రిల్‌లో వారి సంఖ్య 12 లక్షలకు పడిపోయింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించేందుకు జనం వెనకడుగు వేస్తున్నారు. గ్రేటర్ జోన్ పరిధిలో 29 డిపోల్లో 2,800 బస్సులుండగా వాటిలో 60 శాతం బస్సులు మాత్రమే రోడ్లపైకి వస్తున్నాయి.
గత నెల మార్చి వరకు 55.6 శాతంగా ఉన్న ప్రయాణికుల ఆక్యుపెన్సీ 35 శాతానికి పడిపోయిందని డిపో మేనేజర్లు చెబుతున్నారు. రద్దీ రూట్లల్లో ఉదయం, సాయంత్రం మాత్రమే బస్సుల్లో ప్రయాణికులుంటున్నారని, ఆ తర్వాత ఏ రూటులోనూ ప్రయాణికులు ఉండటం లేదని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు లేని రూట్లలో బస్సు ట్రిప్పులను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడించారు.
గ్రేటర్ ఆర్టీసీ ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు కరోనా సెకండ్‌వేవ్‌తో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఆర్డినరీ బస్సులు కిలోమీటరు వెళ్లేందుకు డీజిల్‌కు రూ. 18 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. డీజిల్ ఖర్చులైనా వస్తే తప్ప బస్సులు నడపలేమని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గిన రూట్లలో గతంలో బస్సులు 10 ట్రిప్పులు తిరిగితే ప్రస్తుతం 4 నుంచి 6 ట్రిపులకే పరిమితమవుతున్నాయి.
మరోవైపు, ట్రిప్పులు తగ్గిపోవడంతో పలు ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక బస్సు వెళ్లిపోతే మరో బస్సువచ్చేందుకు అరగంట పైగా సమయం పడుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో 8.30 గంటలకు బస్సులు డిపోలకు వెళ్లిపోతున్నాయి. 8.45 గంటలు దాటితో రోడ్లపై బస్సులు కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో అలస్యం అయితే బస్సుల జాడే ఉండటం లేదంటున్నారు.