హైదరాబాద్‌లో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఈ ఘటనపై బాచుపల్లి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారుల అంచనాకు వచ్చారు. దీంతో ఆరిజన్ కన్‌స్ట్రక్షన్ ఎండి అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు క్షేమంగా ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు స్వరాష్ట్రాలకు తరలించనున్నారు అధికారులు..
బాచుపల్లి ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను సిఎం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాచుపల్లి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా.. మంగళవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఆరిజన్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు చెందిన ప్రాజెక్టు సైట్‌లో ప్రమాదం జరిగింది. రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. భవన యజమాని అరవింద్‌రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు.
మృతులందరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సెంట్రింగ్ పనుల కోసం వచ్చిన కార్మికులు.. కన్‌స్ట్రక్షన్ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు.