హైడ్రాపై తగ్గేదేలే..! హైదరాబాద్‌కి సరికొత్త అందాలు జోడిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్

హైడ్రాపై విమర్శలు, హైకోర్టు తీర్పుతో రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఉప్పల్ నల్లచెరువు పునరుజ్జీవ పనులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేసిన ఆయన.. చెరువుల పరిరక్షణ అంటే భావితరాల భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొన్నారు. హైడ్రా పనితీరును కొనియాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

హైడ్రాపై తగ్గేదేలే..! హైదరాబాద్‌కి సరికొత్త అందాలు జోడిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్
CM Revanth Reddy

Updated on: Aug 01, 2026 | 9:53 PM

ఒకవైపు విపక్షాల విమర్శల వర్షం.. మరోవైపు హైకోర్టు తీర్పుతో కలకలం.. అయినా, తగ్గేదే లేదంటూ కాంగ్రెస్‌ కౌంటర్స్‌.. కొన్నాళ్లుగా హైడ్రా అండ్‌ కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ నడుస్తోన్న హైవోల్టేజ్‌ వార్‌ ఇది.. అయితే.. హైడ్రా టార్గెట్‌గా విపక్షాలు ఎన్ని విమర్శలుచేసినా.. రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా.. తగ్గేదే లేదన్న కామెంట్సే.. కాంగ్రెస్‌ నుంచి, సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి వినిపించాయ్‌. ఆరునూరైనా.. నూరుఆరైనా.. హైడ్రా ఆగనే ఆగదని తేల్చిచెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఒక రేంజ్‌ ఎలివేషన్‌ ఇచ్చారు. ఉప్పల్‌ నల్లచెరువు సాక్షిగా హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం. చెరువులు పునరుద్ధరించడంలో హైడ్రా కృషిని అభినందించారు. ఉప్పల్ నల్లచెరువు పునరుజ్జీవానికి హైడ్రా అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. హైదరాబాద్ CURE పరిధిని క్యూర్ చేసుకుంటూ, మన చెరువులకు జీవం పోస్తూ, భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైడ్రా అందిస్తోందన్నారు రేవంత్‌రెడ్డి.

హైదరాబాద్‌లో చెరువుల పునరుజ్జీవంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఉప్పల్‌ నల్లచెరువును ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాడు-నేడు పేరుతో ఒక వీడియోను పోస్ట్‌చేశారు. ఉప్పల్‌ నల్లచెరువు.. గతంలో ఎలా ఉండేదో.. హైడ్రా ఆపరేషన్‌ తర్వాత ఇప్పుడెలా ఉందో తెలియజేస్తూ వీడియో పెట్టారు. రేవంత్‌ పెట్టిన ఈ పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గతంలో మురుగునీటితో కళావిహీనంగా కనిపించిన నల్లచెరువును 20 కోట్ల రూపాయల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. చెరువు శిఖంలో ఆక్రమణలను తొలగించి.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేసింది. వరదనీరు సులభంగా చెరువులోకి చేరేలా రెండు ఇన్‌లెట్లు.. మురుగునీరు కలవకుండా ప్రత్యేక డైవర్షన్‌ కాలువ నిర్మాణాలు చేపట్టారు. చెరువు పూర్తిగా నిండి నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరితే.. ఔట్‌ఫ్లో కోసం ఔట్‌లెట్లు నిర్మించారు. చెరువు ఔట్‌ఫ్లో ఈజీగా మూసీలో కలిసేలా ఏర్పాట్లుచేయడంతో ఉప్పల్‌ ప్రాంతంలో వరద ముప్పు కూడా గణనీయంగా తగ్గించారు. హైడ్రా ఆపరేషన్‌ తర్వాత కొత్తరూపు సంతరించుకున్న ఉప్పల్‌ నల్లచెరువు.. ఇటీవల కురిసిన వర్షాలతో నిండుకుండను తలపిస్తోంది. దాంతో, చెరువుల పునరుజ్జీవం, హైడ్రాను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు సీఎం రేవంత్‌.

చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదు.. భావి తరాల భవిష్యత్తును భద్రపరచడమన్నారు సీఎం రేవంత్‌. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మార్చుకుంటున్న హైదరాబాద్‌ను చూస్తుంటే తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఇక ముందు కూడా ప్రతి చెరువును కాపాడుతూ… ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామన్నారు సీఎం రేవంత్‌. అయితే, హైకోర్టు తీర్పుతో విమర్శల దాడి పెరిగినవేళ.. హైడ్రాను ఆకాశానికెత్తుతూ రేవంత్‌రెడ్డి పోస్ట్‌ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us