ఆయుధాలు మిస్సింగ్.. 160 డిటోనేటర్లు ప్రత్యక్షం! బొల్లారం కంటోన్మెంట్‌లో అసలేం జరుగుతోంది?

సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీలో ఆయుధాలు మాయమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, పిస్టల్స్, మ్యాగజైన్లు తదితర సైనిక సామగ్రి మిస్సైనట్లు కేసు వివరాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఫైరింగ్ క్యాంప్ వద్ద 160 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు లభించడం కలకలం రేపింది. ఆయుధాల మిస్సింగ్‌కు, డిటోనేటర్ల లభ్యానికి సంబంధం ఉందా? కంటోన్మెంట్ భద్రతలో ఎక్కడ లోపం జరిగింది? దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఆయుధాలు మిస్సింగ్.. 160 డిటోనేటర్లు ప్రత్యక్షం! బొల్లారం కంటోన్మెంట్‌లో అసలేం జరుగుతోంది?
Madras Regiment Weapons Missing

Edited By:

Updated on: Sep 03, 2026 | 10:48 AM

దేశ సరిహద్దులను కాపాడే సైన్యం. దేశ రక్షణకు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు. అలాంటి ఆయుధాలను భద్రపరిచే ప్రదేశంలో ఎంతటి భద్రత ఉండాలి? ఎవరు పడితే వారు లోపలికి వెళ్లడానికి వీలు ఉండదు. ప్రతి ఆయుధానికి లెక్క ఉంటుంది. ప్రతి మ్యాగజైన్‌కు లెక్క ఉంటుంది. ప్రతి రౌండ్‌కు లెక్క ఉంటుంది. ఆయుధాలు ఎవరి అధీనంలో ఉన్నాయో రికార్డు ఉంటుంది. అలాంటి అత్యంత సున్నితమైన ప్రదేశం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌ కోటే, బెటాలియన్ మ్యాగజైన్‌లోనే ఆయుధాలు మాయమయ్యాయి. అంతేకాకుండా.. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో పెద్ద మొత్తంలో డిటోనేటర్లు లభ్యమవ్వడం సంచలనంగా మారింది.

అసలు ఆర్మీ ఆర్మరీలో ఏం ఉంటుంది?

సాధారణంగా యూనిట్‌కు కేటాయించిన సర్వీస్ రైఫిళ్లు, పిస్టల్స్, మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి, అవసరమైన రాత్రి దృష్టి పరికరాలు వంటి సైనిక సామగ్రి కట్టుదిట్టమైన నియంత్రణలో ఉంటుంది. ప్రతి యూనిట్‌కు కేటాయించిన ఆయుధాలు, వాటి వినియోగం, తిరిగి జమ చేయడం, నిల్వ వివరాలన్నింటికీ లెక్కలు ఉంటాయి. అయితే మొత్తం నిల్వ ఎంత ఉంటుందనేది బహిరంగంగా వెల్లడించే విషయం కాదు.

బొల్లారం ఘటనలో మాత్రం లెక్క తప్పింది.

తాజా ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం నాలుగు 7.62 మిల్లీమీటర్ ఏకే-203 తుపాకులు, ఒక 5.56 మిల్లీమీటర్ ఇన్సాస్ రైఫిల్, ఆరు 9 ఎంఎం పిస్టల్స్, ఒక 6.35 బోర్ పిస్టల్, మొత్తం 21 మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి, రాత్రి దృష్టి పరికరం మాయమయ్యాయి. అంటే ఇది కేవలం కొన్ని తుపాకులు కనిపించకుండా పోయిన ఘటన కాదు. ఆయుధాలు, మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి, సైనిక పరికరాలు ఒకేసారి మాయమైన ఘటన.

ఆయుధాలు ఎవరి అధీనంలో ఉంటాయి?

ఆర్మరీ అనేది ఎవరికైనా స్వేచ్ఛగా వెళ్లి ఆయుధాలు తీసుకునే గది కాదు. ఆయుధాల కస్టడీ, ప్రవేశం, లెక్కింపు అన్నీ నిర్దిష్ట సైనిక వ్యవస్థలో ఉంటాయి. యూనిట్‌లో ఆయుధాల బాధ్యత సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఆయుధాలు తీసుకునే సిబ్బంది, వాటి వినియోగం, తిరిగి జమ చేయడం, నిల్వ తనిఖీలు అన్నింటికీ రికార్డులు ఉండాలి.

అందుకే బొల్లారం ఘటనలో ఆయుధాల గదికి ఎవరి ప్రవేశం ఉంది, తాళాలు ఎవరి అధీనంలో ఉన్నాయి, చివరిసారిగా ఆయుధాల లెక్క ఎప్పుడు చూశారు, ఆ తర్వాత ఆర్మరీని ఎవరు ఉపయోగించారు అనే అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి.

ఆగస్టు 30 సాయంత్రం 6 గంటలకు చివరిసారిగా ఆయుధాల లెక్క సరిగ్గానే ఉందని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆగస్టు 31 ఉదయం ఆర్మరీ తెరిచినప్పుడు తాళాలు, ఆయుధాలు ఉంచిన పెట్టెలు పగలగొట్టి ఉండటం బయటపడింది. అంటే ఈ రెండు సమయాల మధ్యే చోరీ జరిగి ఉండాలి.

ఇక కంటోన్మెంట్ భద్రతపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో నిఘా కెమెరాలు పనిచేస్తున్నాయా? వాటి చిత్రాలు రికార్డు అయ్యాయా? గార్డుల విధులు ఎలా ఉన్నాయి? ఆర్మరీ పరిసరాల్లో ఎవరెవరు తిరిగారు? కంటోన్మెంట్‌లోకి వచ్చినవారు, బయటకు వెళ్లినవారి వివరాల్లో ఏమైనా తేడాలున్నాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

తాజా దర్యాప్తులో నిఘా కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు, ఆయుధాలకు ప్రవేశం ఉన్న సిబ్బంది, లోపలి వ్యక్తుల ప్రమేయం వంటి అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. సైనిక నిఘా విభాగం కూడా దర్యాప్తులో చేరింది. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే వారి పాత్రపై తుది నిర్ధారణ దర్యాప్తు పూర్తయ్యే వరకు చెప్పలేం.

మరో కీలక పరిణామం

మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ క్యాంప్ వద్ద 160 డిటోనేటర్లు లభ్యం అయ్యాయి. గ్రీన్ కలర్ ప్లాస్టిక్ బకెట్లో డీటోనేటర్లను అగంతకులు పెట్టారు. ప్లాస్టిక్ బకెట్లో 8 బండిల్స్ లో ఎలక్ట్రిక్ డిటోనేటర్లు లభ్యం అయ్యాయి. ఒక్కో బండిల్ లో 20 డిటోనేటర్లు గుర్తింపు కాగా.. మొత్తం 160 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు గుర్తించారు.

మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల మిస్సింగ్ తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. మద్రాస్ రెజిమెంట్ సుబేదార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు.. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. 32 వేలు విలువ చేసే డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

వీటిని సేఫ్ గా ఫైరింగ్ క్యాంప్ నుంచి బాంబు స్క్వాడ్ సిబ్బంది తీసేశారు. ఎలక్ట్రిక్ డిటోనేటర్లు కావడంతో వీటిని అధికారులు త్వరగా డిస్పోజ్ చేయనున్నారు.

మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు మాయమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే.. అదే పరిసరాల్లో డిటోనేటర్లు బయటపడటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయుధాల మిస్సింగ్‌కు, డిటోనేటర్ల లభ్యానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు పరిశీలించే అవకాశం ఉంది.

లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందా?

కంటోన్మెంట్ అంటే సాధారణ ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతం కాదు. బయట వ్యక్తి లోపలికి వచ్చి, ఆయుధాల నిల్వ ప్రాంతం వరకు వెళ్లి, తాళాలు పగలగొట్టి, ఆయుధాలు తీసుకుని తిరిగి బయటకు వెళ్లడం అంత సులభమైన విషయం కాదు. అందుకే ఆయుధాల నిల్వ ప్రాంతానికి ఎవరి ప్రవేశం ఉంది, అక్కడి భద్రతా విధానం ఎవరికి తెలుసు, ఆ సమయంలో ఎవరి విధులు ఎక్కడ ఉన్నాయి అనే అంశాలు దర్యాప్తులో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక అసలు విషయం భద్రతా వ్యవస్థలోని అన్ని పొరలు ఎంత పటిష్ఠంగా పనిచేశాయన్నదే. ఆర్మరీ తలుపులు, తాళాలు, గార్డుల విధులు, నిఘా కెమెరాలు, ప్రవేశ నియంత్రణ, ఆయుధాల లెక్కింపు, కంటోన్మెంట్ నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు.. ప్రతి దశలోనూ భద్రత ఉండాలి.

ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయుధాలు బయటకు వెళ్లాయంటే.. ఎక్కడో ఒకచోట భద్రతా వ్యవస్థ విఫలమైందనే అనుమానం సహజంగానే వస్తోంది.

ఇక ముందేం చేయాలి?

మాయమైన ప్రతి ఆయుధానికి సంబంధించిన గుర్తింపు సంఖ్య, ఆయుధ వివరాలు, మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి లెక్కలను పూర్తిగా పరిశీలించాలి. కంటోన్మెంట్‌లోని నిఘా కెమెరాల చిత్రాలు, ప్రవేశ రికార్డులు, సిబ్బంది విధుల వివరాలు, వాహనాల రాకపోకలు, గేట్ల దగ్గర నమోదైన వివరాలను ఒకే క్రమంలో పరిశీలించాలి.

ఆర్మరీలోని ఆయుధాల లెక్కింపును మరింత కట్టుదిట్టం చేయడం, ఒకరి ఆధీనంలో మాత్రమే కాకుండా ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో ప్రవేశం ఉండేలా చూడటం, ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, నిఘా వ్యవస్థను నిరంతరం పనిచేసేలా చూడటం వంటి చర్యలను కూడా మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే తుపాకీ పోయిందంటే ఒక వస్తువు పోయినట్టు కాదు. అది సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే ప్రజల భద్రతకు, పోలీసుల భద్రతకు, దేశ భద్రతకు ప్రమాదంగా మారొచ్చు.

కేసుల విషయానికి వస్తే..

బొల్లారం పోలీసులు ఇప్పటికే BNS సెక్షన్లు 331(4), 305 కింద కేసు నమోదు చేశారు. ఇంట్లోకి లేదా భవనంలోకి చొరబడి నేరానికి పాల్పడటం, భద్రంగా ఉంచిన ఆస్తిని దొంగిలించడం వంటి అంశాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

దర్యాప్తులో ఆయుధాల అక్రమ రవాణా, వాటిని దాచడం, ఇతరులకు అందించడం, కుట్ర లేదా సహకారం వంటి అంశాలు బయటపడితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని చట్టపరమైన నిబంధనలు వర్తించే అవకాశం ఉంటుంది. అందుకే దర్యాప్తు పూర్తయ్యే వరకు అదనపు సెక్షన్లపై తుది నిర్ధారణకు రావడం సరికాదు.

ఇది కేవలం బొల్లారం ఆర్మరీకి సంబంధించిన ఘటన కాదు. దేశ రక్షణ కోసం కేటాయించిన ఆయుధాలు.. దేశాన్ని కాపాడే సైనిక స్థావరంలోనే మాయమవడం భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు రేపుతోంది.

ఆర్మరీకి తాళం ఉంది. కంటోన్మెంట్‌కు గేట్లు ఉన్నాయి. గార్డులు ఉన్నారు. నిఘా వ్యవస్థ ఉంది. ఆయుధాలకు లెక్క ఉంది. కస్టడీ వ్యవస్థ ఉంది. అయినా ఆయుధాలు ఎలా మాయమయ్యాయి?
ఇది దొంగతనం మాత్రమే కాదు. కంటోన్మెంట్ భద్రతా వ్యవస్థలో ఎక్కడ లోపం ఏర్పడిందో బయటపెట్టాల్సిన ఘటన.

ఎవరు దొంగిలించారు అన్నది దర్యాప్తులో తేలాలి. కానీ అంతకంటే ముందు.. ఇంత భద్రత ఉన్న కంటోన్మెంట్‌లో ఆర్మరీ వరకు చోరీ ఎలా చేరింది? ఆయుధాలు బయటకు వెళ్లే వరకు వ్యవస్థ ఎందుకు గుర్తించలేదు? ఎక్కడ లోపం జరిగింది? ఆ లోపానికి బాధ్యత ఎవరిది?

ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే.. బొల్లారం ఆర్మరీలో మాయమైన ఆయుధాల గుట్టుతో పాటు, కంటోన్మెంట్ భద్రతలో ఉన్న అసలు చిల్లు కూడా బయటపడుతుంది.

-కొండవీటి శివనాగరాజు,  డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

Loading...
Unable to load recommendations.
Follow Us