ఓ పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. ఇంటి పక్కనే క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది.. ఇంతకీ ఎవరు చేశారు..? కావాలనే చేశారా..? అన్న విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాసం పక్కనే ఉన్న ఓపెన్‌ప్లాట్‌లో నిమ్మకాయలు, పూజా సామాగ్రి కనిపించడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
మంగళవారం మధ్యాహ్నం మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కనున్న ప్లాటులో నిమ్మకాయలు, ఎర్రని వస్త్రం, పసుపు, కుంకుమ, బొమ్మ, వెంట్రుకలు తదితర వస్తువులను స్థానికులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగినట్టు చెబుతున్నారు..
దీనిపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. హుటాహుటీన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుద్రపూజలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీం కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించింది.
క్షుద్రపూజలకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్లాట్‌లో రాత్రి వేళ కొందరు పూజలు చేసి పలు వస్తువులను పడేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదు.
అయితే, లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్ ఇంటిపక్కనే క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..