
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ఆగస్ట్ 5న నీటి సరఫరా బంద్ కానుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న మంజీరా ప్రాజెక్టులో భాగంగా ఉన్న కలబ్‌గూర్ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ అవుట్‌డోర్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఏర్పాటు, నిర్వహణ పనులు చేపట్టనుంది. ఈ నిర్వహణ పనులు ఆగస్ట్ 5న బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. దీంతో ఈ 6 గంటలు కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం కలగనుందని జలమండలి ప్రకటించింది.
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ -19: ఆర్.సి.పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, మదీనాగూడ, మియాపూర్
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ -22: బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ
3. ట్రాన్స్‌మిషన్ డివిజన్ -2: బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీ, బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, హెచ్‌సీవై, ఇండస్ట్రియల్ ఏరియాలోని బల్క్ తాగునీటి కనెక్షన్లు.
4. ట్రాన్స్‌మిషన్ డివిజన్ -4: ఆఫ్‌టేక్ పాయింట్లు, బల్క్ తాగునీటి కనెక్షన్లు.
వినియోగదారులు ముందస్తుగా అవసరమైన మేరకు తాగునీటిని నిల్వ చేసుకుని, నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి కోరింది. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే సాధారణ తాగునీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని పేర్కొంది. తాత్కాలిక అసౌకర్యానికి వినియోగదారులు సహకరించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. దీంతో ఈఏరియాల్లో నివసించే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలి.