బుధవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు పిడుగుపాటు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.
ఏపీలో బుధవారం వర్షాలు ..
పశ్చిమ బంగాళాఖాతం- దానిని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఒక ఉపరితల తుఫాను వలయం విస్తరించిందని APSDMA MD ప్రఖర్ జైన్ వెల్లడించారు. బుధవారం ఉత్తరాంధ్ర, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం, గురువారాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం తెలంగాణలో రోజంతా దట్టమైన మేఘాలు అలముకుంటాయని.. మధ్యాహ్నం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో సాయంత్రం సమయంలో వర్షం పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
