
ఉదయాన్నే మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? అంటే ఖచ్చితంగా అని చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఈ స్టేట్ ఆ స్టేట్ అన్న తేడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు మన ఆరోగ్యానికి సవాలు విసురుతున్నాయి. కొందరు కల్తీ గాళ్లు మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాలే కాదు.. టీ పొడి సైతం కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం కల్తీ తయారీ వ్యవస్థను భగ్నం చేసింది. సనత్‌నగర్ పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ అధికారులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో సింథటిక్ రసాయనాలతో టీ పొడిని కల్తీ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కల్తీ పాలతో హడలెత్తిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. చెత్త చాయ్‌పత్తా గురించి తెలిసి షాక్‌కు గురవుతున్నారు. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేస్తే తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని ఆందోళన చెందుతున్నారు
సనత్‌నగర్ కల్తీ ఛాయ్ పౌడర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొబ్బరి పీచు, బెల్లం పాకం, ఫుడ్ కలర్‌ను చాయ్ డస్ట్‌లో కలిపి ఎండబెట్టి పౌడర్‌ను అమ్ముతున్నారు కేటుగాళ్లు. బిష్ణోయ్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా కల్తీ టీ పౌడర్ తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మహానగరంలో చాలా షాపులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. కేజీ టీ పౌడర్ 160 రూపాయలకు అమ్ముతున్న బిష్ణోయ్, షాప్‌లకు వెళ్లి షాంపిల్స్ చూపించి ప్రమోట్ చేసుకుంటున్నాడు. రోజుకు 100 కేజీల కల్తీ టీ పౌడర్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు తక్కువ ధరకే ఇస్తుండటంతో షాపుల వాళ్లు సైతం కొనుగోలు చేస్తున్నారు.
ఈ కల్తీ పౌడర్‌తో తయారుచేసిన టీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యులు అంటున్నారు. కాలేయం, కిడ్నీలు వంటి అంతర్గత అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇలాంటి కల్తీ పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కల్తీ టీ పొడి నెట్‌వర్క్‌పై కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..