
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరకు సీ-ప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ నగర అందాలను ఆకాశం నుంచి వీక్షిస్తూ.. కృష్ణా నది పరివాహక ప్రాంతాల మీదుగా ప్రయాణించి.. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని నీటిలో ల్యాండ్ అయ్యేలా సరికొత్త టూరిజం అనుభూతిని అందించాలన్నది ప్రతిపాదనగా ఉంది.
సీఎం భేటీతో మళ్లీ తెరపైకి..
సీ-ప్లేన్ టూరిజం అంశంపై ఇటీవల ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీ-ప్లేన్ సర్వీసులు నడిపితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల నేపథ్యంలో సీ-ప్లేన్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నీటి ప్రాంతాల అనుకూలత, ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
హుస్సేన్ సాగర్‌పై ఏఏఐ పరిశీలన
ఏఏఐకి చెందిన అధికారుల బృందం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి హుస్సేన్ సాగర్ పరిసరాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించినట్టు సమాచారం. సీ-ప్లేన్ టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి.. నీటి లోతు, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి.. ప్రయాణికులకు బోర్డింగ్, డీ-బోర్డింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి వంటి అంశాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లోనూ ఇదే తరహాలో అధ్యయనం చేయనున్నట్టు సమాచారం. రెండు ప్రాంతాల పరిశీలన పూర్తయిన తర్వాత సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక రూపొందించే అవకాశం ఉంది.
సీ-ప్లేన్ ప్రత్యేకత ఏంటి?
సాధారణ విమానాలకు భిన్నంగా సీ-ప్లేన్లకు సంప్రదాయ రన్‌వే అవసరం ఉండదు. నీటి ఉపరితలంపైనే టేకాఫ్ చేసి.. అదే నీటిపై ల్యాండింగ్ చేసే విధంగా వీటిని రూపొందిస్తారు. అయితే విమానం సురక్షితంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు తగిన నీటి లోతు, విస్తీర్ణం, వాతావరణ పరిస్థితులు, ఇతర భద్రతా ప్రమాణాలు కీలకం. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న ప్రతిపాదన ప్రకారం ఈ సీ-ప్లేన్‌లో సుమారు 9 నుంచి 12 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది.
ఆకాశం నుంచి హైదరాబాద్ అందాలు..
హుస్సేన్ సాగర్ నుంచి ప్రయాణం ప్రారంభమైతే ట్యాంక్‌బండ్, బుద్ధ విగ్రహం, సచివాలయం తదితర ప్రాంతాలను ఆకాశమార్గంలో వీక్షించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి కృష్ణా నది పరివాహక ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించి.. ప్రకాశం బ్యారేజీ వద్ద సీ-ప్లేన్ ల్యాండింగ్ అయ్యేలా టూరిజం ప్యాకేజీని రూపొందించే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణంతో పాటు పర్యాటక అనుభూతిని కలిపిన ప్రత్యేక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ ప్రతిపాదనలు..
తెలుగు రాష్ట్రాల మధ్య సీ-ప్లేన్ టూరిజం ఆలోచన కొత్తది కాదు. గతంలో హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ ప్రాంతాలను అనుసంధానిస్తూ సీ-ప్లేన్ సేవలు నిర్వహించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ట్రయల్ రన్‌లు కూడా నిర్వహించినప్పటికీ.. పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని మరోసారి ముందుకు తీసుకురావడంతో సీ-ప్లేన్ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది.
తెలంగాణ టూరిజం రోడ్‌మ్యాప్‌లోనూ..
2025 తెలంగాణ టూరిజం రోడ్‌మ్యాప్‌లో సీ-ప్లేన్ టూరిజం అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తావించింది. ఇప్పుడు ఆ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకురావడానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఏఏఐ పరిశీలన, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, అవసరమైన అనుమతులు, నీటి ప్రాంతాల భద్రతా ప్రమాణాలు వంటి అంశాలు కొలిక్కి వస్తే.. హైదరాబాద్ నుంచి కృష్ణా నది మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకు సీ-ప్లేన్ టూరిజం కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,