
హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆర్థరాత్రి కూడా బస్సులను తిప్పనుంద. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఆర్టీసీ బస్సులను తిప్పాలని నిర్ణయం తీసుకుంది. వివిధ రద్దీ రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. నైట్ షిప్టుల్లో పనిచేసేవారికి ఈ బస్సులు ఎంతో ఉపయోగపడనున్నాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉదయం 5 గంటలకు మొదలవుతున్న ఆర్టీసీ సర్వీసులు రాత్రి 12 గంటల వరకు తిరుగుతున్నాయి. ఆ తర్వాత బస్సులు లేకపోవడంతో నైట్ షిప్టులకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు రాత్రికి నగరానికి చేరుకుంటున్నారు. వీళ్లు నగరంలో ట్రావెల్ చేసేందుకు బస్సులు ఉండకపోవడంతో ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
ప్రస్తుతం పగలు, రాత్రి అనే తేడా లేకుండా నగరంలో నిరంతరం ప్రజల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రాత్రి షిప్ట్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. సెస్టెంబర్ 1 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఏమైనా సందేహాలు ఉంటే 99592256160 నెంబర్‌ను ఆశ్రయించాలని అధికారులు కోరారు. కోఠి నుంచి పటాన్ చెర్వు(222ఏ) రూట్లో మొత్తం నాలుగు బస్సు సర్వీసులు రాత్రిపూట అందుబాటులో ఉండనుండగా.. కోఠి నుంచి తొలి బస్సు రాత్రి 11.40 గంటలకు బయల్దేరుతుంది. ఇక చివరి బస్సు తెల్లవారుజామున 4.30 గంటలకు ఉంటుంది. ఇక సికింద్రాబాద్-పటాన్ చెర్వు(219) రూట్లో రాత్రి 11.20 గంటలకు తొలి బస్సు, చివరి బస్సు తెల్లవారుజామున 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి ఉంటుంది.
ఇక అప్ఝల్ గంజ్-పటాన్ చెర్వు(218) రూట్లో మొత్తం రెండు బస్సులు అందుబాటలో ఉంటాయి. తొలి బస్సు అఫ్జల్‌గంజ్ నుంచి రాత్రి 11.25 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3.05 గంటలకు ఉంటుంది. ఈ బస్సులు సీబీఎస్, కోఠి, లక్డీకాపుల్, ఎస్.ఆర్.నగర్, వై.జంక్షన్, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా సర్వీసులు అందిస్తాయి. ఇక హయత్ నగర్-సికింద్రాబాద్(290U) బస్సు హయత్ నగర్ నుంచి రాత్రి 11.20 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3 గంటలకు ఉంటుంది. అలాగే బాచుపల్లి-వేవ్ రాక్(195W) తొలి బస్సు రాత్రి 9.15 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3.10 గంటలకు ఉంటుంది. అలాగే కొండాపూర్-సికింద్రాబాద్(10H) రూట్లో కొండాపూర్ నుంచి తొలి బస్సు రాత్రి 10.55 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3.40 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ప్లాజా, పోలీస్ లైన్స్, ఆర్.జె.కాలేజ్, స్టేట్ హోమ్, ఉషాకిరణ్, సైబర్ టవర్స్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళతాయి. తొలుత ఈ రూట్లలో ప్రవేశపెట్టగా.. రానున్న రోజుల్లో మరిన్ని రూట్లలోనే రాత్రిపూట బస్సులను తిప్పనున్నారు.