Telangana: నకిలీ నంబర్ ప్లేట్‌తో రూ. 2.5 లక్షలు చోరీ.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?

దోమలగూడలో రూ.2.5 లక్షల నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అశోక్ నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న వృద్ధుడి చేతిలోంచి బ్యాగ్‌ను లాక్కుని పారిపోయిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. రాపిడో డ్రైవర్ తరుణ్ కుమార్‌ను అరెస్టు చేసి రూ. 2.29 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్‌తో దొంగతనం చేసినట్లు తేలింది.

Telangana: నకిలీ నంబర్ ప్లేట్‌తో రూ. 2.5 లక్షలు చోరీ.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
Domalguda Robbery Case

Edited By: Krishna S

Updated on: Dec 08, 2025 | 1:39 PM

హైదరాబాద్ నగరంలోని దోమలగూడ పరిధిలో ఈ నెల 4న జరిగిన నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అశోక్ నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 2.5 లక్షల నగదు డ్రా చేసుకుని కారు వద్దకు వెళ్తున్న వృద్ధుడి చేతిలోంచి బ్యాగ్‌ను లాక్కొని పారిపోయిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఆర్ నగర్‌కు చెందిన వెంకటేశ్వరరావు ఈ నెల 4న అశోక్ నగర్‌లోని యూనియన్ బ్యాంక్‌లో రూ. 2.5 లక్షల నగదు డ్రా చేసుకున్నారు. రోడ్డుపై పార్క్ చేసిన తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆ వృద్ధుడిని ఢీకొట్టి చేతిలో ఉన్న నగదు బ్యాగ్‌తో పరారయ్యాడు. దీంతో బాధితుడు వెంటనే దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నకిలీ నంబర్ ప్లేట్‌తో దొంగతనం

కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దొంగలగూడ ప్రాంతానికి చెందిన రాపిడో డ్రైవర్ అయిన తరుణ్ కుమార్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. దొంగతనం చేసే సమయంలో నిందితుడు తన బైక్‌కు నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించినట్లు తేలింది. దొంగతనం పూర్తయ్యాక జ్యోతి నగర్ మార్కెట్ వద్ద బట్టలు మార్చుకొని నంబర్ ప్లేట్‌ను తొలగించినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడు తరుణ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి దొంగిలించిన బైక్‌తో పాటు రూ.2.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.