ఎటుపోతోంది ఈ సమాజం.. అటు వైద్యులు పట్టించుకోలేదు.. ఇటు ప్రజలూ పట్టించుకోలేదు.. చివరికి ఆ చిన్నారి..

|

Mar 30, 2021 | 11:49 AM

Hyderabad News: వైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఆ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ లోకాన్ని చూడకుండానే కన్నుమూశాడు..

ఎటుపోతోంది ఈ సమాజం.. అటు వైద్యులు పట్టించుకోలేదు.. ఇటు ప్రజలూ పట్టించుకోలేదు.. చివరికి ఆ చిన్నారి..
Born Baby
Follow us on

Hyderabad News: వైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఆ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ లోకాన్ని చూడకుండానే కన్నుమూశాడు పండంటి మగబిడ్డ. ఆస్పత్రి ముందే నడిరోడ్డుపై 30 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ కింద పడిపోతే ఆస్పత్రి వర్గాలే కాదు.. రోడ్డున పోయే వారు సైతం ఆమె పట్టించుకోకపోవడం దుర్మార్గం అని చెప్పాలి. చివరికి ఆ మహిళ మురికి కాలువ పక్కనే బిడ్డకు జన్మనిచ్చింది. సమయానికి వైద్యం అందక ఆ శిశువు కన్నుమూశాడు. ఈ హృదవిదారక ఘటన హైదరాబాద్ పట్టణ శివారులోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, విశ్వనీయ సమాచారం ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన లక్ష్మీ(30) బిక్షాటన చేస్తూ జవహార్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బయట కూర్చుంది. ఆ సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి.

అంతలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, సమయానికి చికిత్స అందకపోవడంతో ఆ చిన్నారి ఈ లోకాన్ని చూడకముందే శాశ్వతంగా కన్నుమూశాడు. పక్కనే ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నా వైద్యులు ఆమెను పట్టించుకోలేదు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లే వారు సైతం ఆమెను వీడియోలు తీశారే తప్ప.. ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం శోచనీయం. చివరికి మహిళ సైతం స్పృహతప్పిపోయింది. విషయం తెలుసుకున్న జగహార్ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదిలాఉంటే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కళ్లముందే ఓ మహిళ అంతటి దీన స్థితిలో ఉంటే ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని చూస్తూ పట్టించుకోని వారు కూడా ఆ చిన్నారి మృతి కారణం అంటూ భగ్గమంటున్నారు. మనుషుల్లో రోజు రోజు మానవత్వం నశించిపోతుందనడానికి ఇదొక నిదర్శనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Nanded Gurudwara Attack:కరోనా నేపథ్యంలో హోలా మొహల్లాని ఆపాలని చూసిన పోలీసులు… దాడి చేసిన ప్రజలు

Andhra Students: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. నేటితో స్కాలర్‌షిప్ దరఖాస్తుకు ముగియనున్న గడువు