పండుగపూట యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు.. పోలీసుల విచారణలో 4ఏళ్ల పగ!

హైదరాబాద్ తుకారాం గేట్‌లో కార్తీక్ అనే యువకుడు కత్తులతో దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కార్తీక్ కదలికలపై నిందితులకు ముందే సమాచారం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

పండుగపూట యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు.. పోలీసుల విచారణలో 4ఏళ్ల పగ!
Hyderabad Crime

Edited By:

Updated on: Sep 14, 2026 | 4:25 PM

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య కలకలం రేపింది. లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుకారాం గేట్‌లో కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పండగ పూట హడావుడిలో ఉన్న కార్తీక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కత్తిపోట్లకు గురైన కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హత్య వెనుక అసలు కారణమేంటి? కార్తీక్‌ను ఎవరు టార్గెట్ చేశారు? పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే ఈ హత్యకు నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమ వ్యవహారానికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు నాలుగేళ్ల క్రితం ఓ యువతి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన ఘటనలో కార్తీక్ సాయం చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జరిగిన ఈ వ్యవహారం విషయంలో కొందరికి కార్తీక్‌పై కోపం ఉన్నట్లు తెలుస్తోంది. అదే పాత కక్షతో తాజాగా కార్తీక్‌తో గొడవకు దిగారా? గొడవ కాస్తా కత్తితో దాడి చేసే వరకు వెళ్లిందా? లేక ముందుగానే కార్తీక్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారా? అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.

పండగపూట హడావుడిలో ఉన్న కార్తీక్ వచ్చిన సమయంలోనే అతడిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్తీక్ కదలికలను ముందుగానే తెలుసుకుని నిందితులు అక్కడికి చేరుకున్నారా? లేక అక్కడే జరిగిన చిన్న గొడవ హత్యకు దారితీసిందా? అనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు కార్తీక్‌తో ఇటీవల ఎవరెవరికి గొడవలు జరిగాయి? అతడికి ఎవరితో పాత వివాదాలు ఉన్నాయి? నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రేమ వ్యవహారంలో ఉన్న వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు.

ఘటనాస్థలంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆధారాలను సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, నిందితుల కదలికలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పాత ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమా? లేక దాని వెనుక మరో కోణం ఏదైనా ఉందా? అనేది పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్తీక్ హత్యతో తుకారాం గేట్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us