Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్‌ షాక్‌..! భారీగా పెరిగిన మెట్రో టిక్కెట్ ధరలు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు మే 17 నుండి పెరుగుతున్నాయి. L&T మెట్రో రైల్ లిమిటెడ్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, కనిష్ట టిక్కెట్ ధర రూ.10 నుండి రూ.12 కు, గరిష్ట ధర రూ.60 నుండి రూ.75 కు పెరిగింది. ఈ పెంపు దినచర్యా ప్రయాణికులకు భారం అవుతుందని భావిస్తున్నారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్‌ షాక్‌..! భారీగా పెరిగిన మెట్రో టిక్కెట్ ధరలు
Hyderabad Metro Rail

Updated on: May 15, 2025 | 5:32 PM

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఊహించని షాకిచ్చింది. మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనిష్ట టిక్కెట్‌ ధర రూ.12 నుంచి గరిష్ట టిక్కెట్‌ ధర రూ.75గా నిర్ణయించింది. పెంపు కంటే ముందు కనిష్ట ధర రూ.10, గరిష్ట ధర రూ.60గా ఉండేది. కాగా, పెంచిన ఛార్జీలు మే 17(శనివారం) నుంచి అమల్లోకి రానున్నాయి. నిత్యం మెట్రోలో ప్రయాణిస్తూ ఆఫీస్‌లకు వెళ్తున్న ప్రయాణికులకు ఈ పెంపు మరింత భారం కానుంది.

ఈ ఛార్జీల పెంపుపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ స్పందిస్తూ.. “మా విలువైన ప్రయాణీకుల నిరంతర మద్దతు, ప్రోత్సాహానికి మేం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు సేవల నాణ్యతను అందరికీ నిర్వహించడానికి, పెంచడానికి అవసరమైన ఈ సవరించిన ఛార్జీల నిర్మాణాన్ని స్వీకరించడంలో మీ సహకారాన్ని మేం అభ్యర్థిస్తున్నాం” అని పేర్కొంది. కాగా లార్సెన్ అండ్‌ టూబ్రో అనుబంధ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్‌ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (DBFOT) ప్రాతిపదికన అమలు చేస్తారు. సెప్టెంబర్ 4, 2010న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రాయితీ ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి