
హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. లోన్ ఈఎంఐ టైంకి కట్టలేదన్న నెపంతో లోన్ యాప్ నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ ఓ మహిళపై ఒత్తిడి తేవడమే కాకుండా, పదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ రాజలింగం కాలనీకి చెందిన ఓ మహిళ తన బంధువు అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్‌లో డబ్బులు తీసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దిరోజులుగా ఆమె ఈఎంఐ చెల్లించడం ఆపేసింది. దీంతో అప్పటి నుంచి లోన్ యాప్ నిర్వాహకులు ఆమెకు ఫోన్లు చేసి లోన్ కట్టాలని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. నిర్వాహకుల ఆగడాలు భరించలేక ఆమె ఆ నంబర్లను బ్లాక్ చేసినప్పటికీ, వారు ఇతర నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ నిరంతరం వేధిస్తూనే ఉన్నారు.
ఒకానోక సందర్భంలో మరీ బరితెగించిన నిర్వాహకులు, బాధితురాలి పదవ తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి… ఆ ఫొటోలను వాట్సప్ ద్వారా బాధిత తల్లికి పంపించారు. వెంటనే లోన్ డబ్బు చెల్లించకపోతే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
ఇక లోన్ యాప్ నిర్వాహకుల బ్లాక్‌మెయిలింగ్‌తో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఏం చేయాలో అర్థంకాక మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి ఫిర్యాదు చేసింది. జరిగిన సంఘటనను మొత్తం పోలీసులకు వివరించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు లోన్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.