హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్లారు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి భక్తులు చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఓఆర్‌ఆర్, మొయినాబాద్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
గరుడ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం
దేవాలయంలో గరుడ ప్రసాదం పంచుతామని 3 రోజుల క్రితం ప్రకటించారు.ఈ గరుడ ప్రసాదం ప్రతి ఏటా ఇచ్చేదే అయినా…ఈసారి సోషల్ మీడియాలో దీన్ని గురించి విపరీతమైన ప్రచారం జరిగింది. గరుడ ప్రసాదం తిన్న మహిళలకు సంతాన భాగ్యం కలిగిందని పలువురు చెబుతున్నారు. సంతాన భాగ్యం కోసం…రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు దంపతులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. గరుడ ప్రసాదంతో పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు, ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడ్డారు.
ట్రాఫిక్ జామ్‌లో అంబులెన్స్‌లు చిక్కుకోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొయినాబాద్ ఏరియాలో 25కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రసాదం పంపిణీ ముగిసిందని పోలీసులు చెబుతున్నా… భక్తులు వస్తూనే ఉండడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది.
అటు ఆలయ నిర్వాహకులు, ఇటు పోలీసులు…ముందుగానే సరైన ఏర్పాట్లు చేసి ఉంటే భక్తులతో పాటు వాహనదారులకు కూడా ఇబ్బందులు ఉండేవి కావంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి