Telangana: శ్మశానవాటికలో అక్రమ దందా.. పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..

గ్యాస్ సిలిండర్ కావాలా? అయితే రూ. 6 వేలు ఇచ్చుకోవాల్సిందే.. నగరంలో కృత్రిమ కొరతను సృష్టించి హోటళ్లు, రెస్టారెంట్లను నిలువునా ముంచుతున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టయింది. పశ్చిమ ఆసియా సంక్షోభం నెపంతో వదంతులు సృష్టిస్తూ, బహిరంగ మార్కెట్‌లో దోపిడీకి తెరలేపిన డీలర్‌తో సహా 10 మందిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

Telangana: శ్మశానవాటికలో అక్రమ దందా.. పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
Commercial Cylinders Seized In Panjagutta Graveyard

Updated on: Mar 30, 2026 | 8:35 PM

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందన్న భయాందోళనలను ఆసరాగా చేసుకుని, కోట్లలో లాభాలు గడిస్తున్న ముఠా ఆట కట్టించారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. పంజాగుట్టలోని శ్మశాన వాటికను అడ్డాగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా గ్యాస్ లభ్యత తగ్గిందని, రాబోయే రోజుల్లో సిలిండర్లు దొరకవని ఈ ముఠా హోటళ్లు, రెస్టారెంట్లలో కృత్రిమ భయాన్ని సృష్టించింది. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.2,100 ఉండే కమర్షియల్ సిలిండర్‌ను ఏకంగా రూ.6,000 వరకు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. పోలీసుల కళ్లు గప్పడానికి పంజాగుట్టలోని శ్మశాన వాటికలో సిలిండర్లను నిల్వ చేశారు. నిందితులు శంషాబాద్‌లో ఒక భారీ గోదాంను, అఫ్జల్‌గంజ్‌లో ఒక ఆఫీసును కూడా నిర్వహిస్తున్నారు.

భారీగా పట్టుబడిన నిల్వలు

టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ టీమ్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో 414 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.22 లక్షలు ఉంటుందని తెలిపారు. 11 వాహనాలు సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు మహ్మద్ అమీర్‌తో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కొందరు గ్యాస్ డెలివరీ బాయ్స్ కూడా ఉండటం గమనార్హం.

ఏడాదిన్నరగా గుట్టుచప్పుడు కాకుండా..

ఈ ముఠా గత 18 నెలలుగా ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరుతో కమర్షియల్ గ్యాస్ సరఫరాను మళ్లించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. నగరంలోని చిన్న తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు గ్యాస్ దొరక్క విధిలేని స్థితిలో వీరి దగ్గర మూడు రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

నగరంలో గ్యాస్ కొరత లేదు, సరఫరా సజావుగానే ఉంది. వదంతులను నమ్మి ఎవరూ బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయవద్దని డీసీపీ రఘునాథ్ స్పష్టం చేశారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Follow Us