పది చదివి.. పెద్ద డాక్టర్లలా ఫోజులు! హైదరాబాద్‌లో 10 మంది ఫేక్‌గాళ్లు అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న 10 మందిని అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి మందులు, సెలైన్ బాటిళ్లు, సిరంజీలు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పది చదివి.. పెద్ద డాక్టర్లలా ఫోజులు! హైదరాబాద్‌లో 10 మంది ఫేక్‌గాళ్లు అరెస్ట్
Fake Doctors In Hyderabad

Edited By:

Updated on: Sep 02, 2026 | 8:10 PM

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ వైద్యుల దందాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, వైద్య అధికారులతో కలిసి ఏకకాలంలో 10 నకిలీ క్లినిక్‌లపై మెరుపు దాడులు నిర్వహించారు. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పేట్‌బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్‌చెరు, ఆర్సీపురం తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుచ్చయ్ (35), సుధాకర్‌చారి (61), అంజగౌడ్ (49), రమావత్ ప్రకాష్ (26), మేకల అక్షయ్ (35), నారాయణ (50), ప్రహ్లాద్ (55), కొనపాల బుచ్చిబాబు (50), శ్రీనివాస్‌రావు (47), గంగారాం (55) ఉన్నారు. నిందితులు ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్హతలతోనే ఆర్‌ఎంపీ డాక్టర్లుగా చెలామణి అవుతూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని క్లినిక్‌లలో బెడ్లు ఏర్పాటు చేసి చిన్నారులకు సైతం చికిత్స అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వైద్య పరిజ్ఞానం, సరైన అర్హతలు లేకుండానే రోగులకు సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దాడుల్లో 9 బీపీ మిషన్లు, 10 థర్మామీటర్లు, 10 స్టెతస్కోప్‌లు, వెయింగ్ మిషన్లు, వివిధ రకాల మందులు, సెలైన్ బాటిళ్లు, సిరంజీలు, ఎక్స్‌పైరీ అయిన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు వైద్యం కోసం సరైన విద్యార్హతలు, వైద్య ధ్రువపత్రాలు కలిగిన డాక్టర్లను మాత్రమే సంప్రదించాలని సూచించారు. తమ పరిసరాల్లో నకిలీ వైద్యులు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు లేదా వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us