
హైదరాబాద్ నగరంలో మరో ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహం పేరుతో మొదలైన సంబంధం క్రూరత్వంతో ముగిసింది. స్నేహితురాలిపై పాశవిక దాడి, హింస, బెదిరింపుల వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. గుంటూరుకు చెందిన యువతి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోర్సును మధ్యలోనే ఆపేసి, ల్యాంకోహిల్స్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం ప్రారంభించింది. సోమాజిగూడ కపాడియా లైన్‌లో ఉన్న ఫ్లాట్‌లో ఆమె తన స్నేహితులతో కలిసి నివసిస్తోంది. ఆమె పనిచేసే సంస్థలోనే వర్క్ చేసే చైతన్యనగర్‌కు చెందిన భానుప్రకాష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తరువాత ప్రేమగా మారింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, భానుప్రకాష్ ఆమెను వలలోకి దించాడు. కొంతకాలం తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ ఆమెను వేధించడం, కొట్టడం, బెదిరించడం అతనికి అలవాటైపోయింది.
ఈ నెల 26వ తేదీ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో భానుప్రకాష్ అకస్మాత్తుగా బాధితురాలు ఉన్న ఫ్లాట్‌కి వెళ్లాడు. ఆమె రూమ్‌మేట్స్‌ను బెదిరించి గదిలో బంధించాడు. అనంతరం యువతిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కత్తెరతో ఆమెపై దాడి చేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ పోసి చంపేస్తా అంటూ ఆమెను బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మొదట తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు మరుసటి రోజు ధైర్యం తెచ్చుకుని తన స్నేహితుల సాయంతో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలాల ఆధారంగా నిందితుడు భానుప్రకాష్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.