హమ్మయ్యా.. పోలీసులకు చిక్కిన గజ దొంగ! రికవరీ చోరీ సొమ్ము ఎంతో తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి

అంబర్‌పేట్ పోలీసులు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మల్యాల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతని వద్ద నుండి లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

హమ్మయ్యా.. పోలీసులకు చిక్కిన గజ దొంగ! రికవరీ చోరీ సొమ్ము ఎంతో తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి
Hyderabad Robber

Edited By:

Updated on: Jun 23, 2026 | 9:46 PM

రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను అంబర్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాధునిక సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న కమలానగర్‌లోని ఓ ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన నిందితుడు మల్యాల శ్రీనివాస్ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, సౌదీ రియాల్స్, ఎల్ఈడీ స్మార్ట్ టీవీతో పాటు ఇతర విలువైన వస్తువులను అపహరించాడు. బాధితుల ఫిర్యాదుతో అంబర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు నిందితుడి జాడను గుర్తించారు. ఈ నెల 23న అంబర్‌పేట్ 6 నెంబర్ ప్రాంతంలో మల్యాల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా ఈ కేసుతో పాటు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో చోరీ కేసుకు సంబంధించిన సొత్తు కూడా అతడి వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు కేసులకు సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి నుంచి గడియారాలు, మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, ఉంగరాలు, బ్లూటూత్ స్పీకర్, ఎల్ఈడీ టీవీ, ద్విచక్ర వాహనం సహా పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే నిందితుడు గతంలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడ్డాడా..? ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. నిందితుడి నేర చరిత్రపై ఆరా తీస్తున్న అధికారులు మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us