
కట్టుకున్న భార్యకు రక్షణగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారాడు.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొంతుకోసి హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లోని నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులు, వరలక్ష్మి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వరలక్ష్మి స్థానిక ఐటిసి (ITC) పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, భర్త త్రిమూర్తులు చిరు వ్యాపారం చేస్తున్నాడు. గత కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరాయి..
ఈ క్రమంలోనే.. వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించేందుకు శుక్రవారం రోజే పెద్దలు పంచాయితీ నిర్వహించి సయోధ్య కుదిర్చారు. కానీ, ఆ రాజీ త్రిమూర్తుల మనసులోని క్రూరత్వాన్ని మార్చలేకపోయింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో త్రిమూర్తులు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.
భార్య వరలక్ష్మి గొంతును చాకుతో కోసి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడుతో పాటు, ఇంట్లో దాచుకున్న లక్ష రూపాయల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారి విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..