తెలంగాణలోని ఆ ప్రాంతంలో ఖర్జూర కల్లుకు విపరీతమైన డిమాండ్.. లీటరు రూ. 200పైనే.. ఆ గీత కార్మికుడి ఐడియా అదుర్స్

|

Feb 11, 2021 | 10:13 PM

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆ ప్రాంతం బాగా వెనుకబడింది. గతంలో ఎటు చూసిన కరవు పరిస్థితులే దర్శనమిచ్చేవి. కనీసం తాటి, ఈత కల్లు విక్రయించుకోవాలన్నా గౌడన్నలు నానా అవస్థలు పడే వారు.

తెలంగాణలోని ఆ ప్రాంతంలో ఖర్జూర కల్లుకు విపరీతమైన డిమాండ్.. లీటరు రూ. 200పైనే.. ఆ గీత కార్మికుడి ఐడియా అదుర్స్
Follow us on

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆ ప్రాంతం బాగా వెనుకబడింది. గతంలో ఎటు చూసిన కరవు పరిస్థితులే దర్శనమిచ్చేవి. కనీసం తాటి, ఈత కల్లు విక్రయించుకోవాలన్నా గౌడన్నలు నానా అవస్థలు పడే వారు. ఇప్పుడు కాలం మారింది. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గీత కార్మికులు రొటీన్ కు భిన్నంగా ఆలోచిస్తున్నారు. పండ్ల తోటల మాదిరిగా సొంత భూముల్లో కర్జూర, ఈత తోటలను పెంచుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన జి.యాదయ్య వృత్తి రీత్య గీత కార్మికుడు. పెద్దగా చదువుకోక పోయినప్పటికీ వ్యవసాయంతో పాటు గీత వృత్తిని కూడా కొనసాగిస్తూ వచ్చాడు. తాను చేస్తున్నగీత వృత్తిలో అనేక ఇబ్బందులను ఎదురవుతుండడంతో ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తనకున్న మూడెకరాల పొలంలో ఖర్జూర తోట వేయాలని నిర్ణయించాడు. 2006లో తన మూడెకరాల భూమిలో 1600 ఖర్జూర మొక్కలు నాటాడు. ఖర్జూర పండ్లకు బదులుగా వాటి నుంచి కల్లు గీయాలని నిర్ణయించుకున్నాడు.

తీవ్ర కరువు పరిస్థితులు అతన్ని వెంటాడాయి. తన పొలంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఖర్జూర తోటను కాపాడుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆరు వందల మొక్కలు చనిపోయాయి. మిగిలిన వెయ్యి మొక్కలను కాపాడుకోవాలని మూడెకరాల పొలంలో 20 బోర్లు వేశాడు. అందుకు లక్షలు ఖర్చుపెట్టుకున్నాడు. చివరకు కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్లాట్లను కూడా అమ్ముకున్నాడు. ట్యాంకర్ల తో నీళ్లు పోసి మొక్కలను దక్కించుకున్నాడు. పదిహేనేళ్ల క్రితం ఖర్జూర తోటను కాపాడుకునేందుకు యాదయ్య పడుతున్న కష్టాన్ని చూసి స్థానికులు కూడా చలించిపోయారు. బోర్లు వేసేందుకు అప్పట్లో కొంత మంది సహాయం కూడా చేశారు. దీంతో బోర్ల యాదయ్యగా అతనికి పేరు వచ్చింది. చివరకు ఒక్క బోరు సక్సెస్ అవడంతో ఆ తోటను కాపాడుకోగలిగాడు. ఖర్జూర తోట పెట్టి తప్పు పని చేశావని చాలా మంది చెప్పినా వినిపించుకోకుండా తోటను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. దాని ఫలితమే ఇప్పుడు మార్కెట్ ను ఉర్రూతలూగిస్తున్న ఖర్జూర కల్లు.

ప్రస్తుతం ఖర్జూర కల్లు ఓ రేంజ్‌లో అమ్ముడు పోతోంది. ఉదయం ఆరు గంటల నుంచి యాదయ్య పొలం వద్ద కల్లు ప్రియులు లైన్ కడుతున్నారు. మరికొంత మంది ముందుగానే ఆర్డర్లిచ్చి కల్లు తెప్పించుకుంటున్నారు. పదిహేనేళ్లుగా యాదయ్య పడ్డ కష్టానికి ఫలితం దక్కుతోంది. ఖర్జూర కల్లు విక్రయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు యాదయ్య. తాటి, ఈత కల్లుతో పోల్చుకుంటే ఖర్జూర కల్లు చాలా తియ్యగా ఉంటుంది. ఖర్జూర కల్లులో ఎలాంటి వాసన ఉండదు. కల్లు తాగిన వారి వద్ద కూడా వాసన రాదు. అచ్చు కొబ్బరి నీళ్లలా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది. శ్రేష్టమైన ఖర్జూర కల్లును లీటరు రెండు వందల రూపాయలకు విక్రయిస్తున్నాడు. అయినప్పటికీ కల్లు ప్రియులు మాత్రం ఖర్జూర కల్లును వదలడం లేదు. దూర ప్రాంతాల వారు వచ్చి తాగుతుండడం వల్ల తమకు ఖర్జూర కల్లు దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు.

మొత్తానికి కష్టానికి ఫలితం తప్పక లభిస్తుందని నిరూపించాడు యాదయ్య. రోటీన్ కు భిన్నంగా ఆలోచించి రికార్డును సృష్టించడమే కాకుండా కొత్త పదార్థాన్ని సమాజానికి అందించగలిగాడు. అందుకే అందరికి ఆదర్శంగా నిలిచాడు యాదయ్య.

Also Read:

డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. రేగు పండ్ల కోసం వెళ్లి.. వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి