జీవమే ప్రాణమనుకున్నాడు.. మేకను కాపాడే ప్రయత్నంలో కాపరి ప్రాణాలు బలి!

మనుషుల మధ్యే మమకారం కరువవుతున్న ఈ రోజుల్లో, తాను నమ్ముకున్న మూగజీవం కోసం ఓ రైతు తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. జీవమే తన ప్రాణం అని నమ్మిన ఆ కాపరి, మేకను కాపాడే ప్రయత్నంలో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

జీవమే ప్రాణమనుకున్నాడు.. మేకను కాపాడే ప్రయత్నంలో కాపరి ప్రాణాలు బలి!
Herdsman Loses Life

Edited By:

Updated on: Apr 23, 2026 | 11:13 AM

మనుషుల మధ్యే మమకారం కరువవుతున్న ఈ రోజుల్లో, తాను నమ్ముకున్న మూగజీవం కోసం ఓ రైతు తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. జీవమే తన ప్రాణం అని నమ్మిన ఆ కాపరి, మేకను కాపాడే ప్రయత్నంలో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కాల్వపల్లి తండాకు చెందిన రవీందర్ నాయక్ ఒక సామాన్య రైతు. గొర్రెలు, మేకల పెంపకమే అతనికి జీవనోపాధి. వాటిని కేవలం జంతువులుగా కాకుండా, తన కుటుంబ సభ్యుల్లాగే ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజూలాగే ఆ రోజు కూడా తన మందను తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. ఎండ తీవ్రతకు దాహం వేయడంతో గొర్రెలు, మేకలు అన్నీ సమీపంలోని అవిరేణికుంటతండా చెరువు వద్దకు నీరు తాగడానికి వెళ్ళాయి.

నీళ్లు తాగే క్రమంలో ఒక మేక ప్రమాదవశాత్తు చెరువులోకి దూకింది. నీటిలో మునిగిపోతూ, బయటకు రావడానికి ఆ మేక ప్రాణభయంతో కొట్టుమిట్టాడటం గట్టు మీద ఉన్న రవీందర్ గమనించాడు. కళ్లెదుటే తను పెంచుకున్న జీవం ప్రాణాలు పోతుంటే ఆ రైతు తట్టుకోలేకపోయాడు. ఈత సరిగ్గా రాకపోయినా, ప్రమాదమని తెలిసినా.. తన మేకను రక్షించడమే లక్ష్యంగా చెరువులోకి దిగాడు. అతను మేకను పట్టుకుని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు నీటి లోతు ఎక్కువగా ఉండటం, ఊపిరి ఆడకపోవడంతో రవీందర్ నీటిలో మునిగిపోయాడు. మేక ప్రాణం నిలబడే లోపే, ఆ యజమాని ప్రాణం గాలిలో కలిసిపోయింది.

మృతుడు రవీందర్ నాయక్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మూగజీవం కోసం ప్రాణాలు వదిలిన రవీందర్ సాహసాన్ని, అతనికున్న పశుప్రేమను చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైతుకు తన పశువులే ఆస్తి.. అవే సర్వస్వం అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఆ మేకను కాపాడాలన్న అతని తపన గెలిచినా, మృత్యువుతో జరిగిన పోరాటంలో ఆ నిరుపేద రైతు ఓడిపోయాడు. తన కుటుంబాన్ని అనాథగా చేసి, మూగజీవాల పట్ల తనకున్న అపారమైన ప్రేమను చాటిచెప్పి రవీందర్ నాయక్ శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us