ఎండల్లో జర జాగ్రత్త.. వేడిగా ఉందని కూలర్ ఆన్ చేసిన మహిళ.. అంతలోనే..

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎండల వేడి.. ప్రాణాలు తీస్తోంది.. బయటకు వెళ్లాలంటేనే.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా..వడదెబ్బతో ఒకరు మృతి చెందగా, చల్లదనం కోసం ప్రయత్నించి కూలర్ విద్యుదాఘాతంతో మరొకరు కన్నుమూశారు. ఈ వేసవిలో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా, ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స పొందాలి.

ఎండల్లో జర జాగ్రత్త.. వేడిగా ఉందని కూలర్ ఆన్ చేసిన మహిళ.. అంతలోనే..
Extreme Summer Heat Claims Lives

Edited By:

Updated on: Apr 21, 2026 | 6:32 PM

ఎండలు ప్రాణాలు తీసేస్తున్నాయి. నిప్పుల కుంపటిలా మరి మరణపాశాలుగా మారుతున్నాయి. ఎండ వేడికి తట్టుకోలేక కూలర్ గాలి కోసం ప్రయత్నించినా ప్రాణాలు నిలవడం లేదు. ప్రకృతి పగపట్టిందా అన్నట్టుగానే ఎండలు దంచి కొడుతుంటే.. ఆ ఎండల్లో బయటకి వెళ్తున్న జనం ప్రాణాలతో తిరిగి వొస్తారో లేదో అన్న భయం కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే భయం.. వామ్మో ఈ ఎండల్లో బయటకి వెళితే ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరుకుంటామా అన్న ఆందోళనే అందరిలో కనిపిస్తుంది. తాజాగా ఎండల తీవ్రతకు తాళలేక అస్వస్థతకు గురై ఒకరు చనిపోగా.. మరొకరు ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు కూలర్ చల్ల గాలి నీడకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 కాలనీకి చెందిన గొడిశెల శ్రీనివాస్ (46) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. శ్రీనివాస్ టెంట్ హౌజ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13న ఓ శుభకార్యానికి టెంట్ వేసేందుకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో స్థానిక వైద్యుని వద్ద చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. సోమవారం పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు.

ప్రాణం తీసిన కూలర్..

మరో వైపు ఈ వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏర్పాటు చేసుకున్న కూలరే ఓ గృహిణి ప్రాణం తీసింది. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకోగా.. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు అమ్మ ప్రేమను దూరం చేసింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి టి పంచాయతీ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన కొలాం గిరిజన తెగకు చెందిన మహిళ ఆత్రం మీనాక్షి (22) ఆదివారం అర్ధరాత్రి కూలర్ గాలి కోసం స్విచ్ ఆన్ చేయబోయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృత్యు వాత పడింది.

అచేతనంగా పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని సోమవారం రిమ్స్ మార్చురీకి తరలించారు. మృతురాలికి అయిదేళ్ల లోపు కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. తల్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం తో చిన్నారులు అమ్మ ప్రేమకు దూరమయ్యారు.

అయితే.. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతమేరకు ఎండలు బాగా ఉన్నప్పుడు బయటకు వెళ్లొద్దని.. వెళితే.. మంచినీళ్లు వెంట తీసుకెళ్లాలని.. ఎండ వేడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఒకవేళ.. అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స పొందాలని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us