పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..బాధితుడు నిలదీయడంతో

చట్టాన్ని రక్షించాల్సిన వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషనే మద్యం సిట్టింగ్‌కు అడ్డాగా మారితే ఎలా ఉంటుందో నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాత్రి వేళ విధుల్లో ఉండాల్సిన ఒక హెడ్ కానిస్టేబుల్, నిందితుడితో కలిసి పోలీస్ స్టేషన్ లోపలే యథేచ్ఛగా మద్యం సేవించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీస్ స్టేషన్‌లో మందు మజా.. నిందితుడితో ఖాకీ సిట్టింగ్ కలకలం..బాధితుడు నిలదీయడంతో
police station liquor scandal

Edited By:

Updated on: May 26, 2026 | 8:21 PM

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే మద్యం మత్తులో జోగడం తీవ్ర సంచలనంగా మారింది. కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన ఫిరోజ్, ఇస్మాయిల్ అనే రెండు కుటుంబాల మధ్య ఒక విషయంలో తీవ్రమైన గొడవ జరిగింది. ఈ గొడవపై బాధితుడు ఇస్మాయిల్ వెంటనే కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఫిరోజ్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన తర్వాత నిందితుడిని పిలిపించి కఠినంగా విచారించాల్సిన హెడ్ కానిస్టేబుల్ పండరి బాధ్యతారహిత్యంగా ప్రవర్తించాడు. రాత్రి డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పండరి.. స్టేషన్ లోపలే నిందితుడైన ఫిరోజ్‌ను తన పక్కన కూర్చోబెట్టుకుని, ఇద్దరూ కలిసి యథేచ్ఛగా మందు కొట్టడం ప్రారంభించారు.

కేసు ఏమైందో తెలుసుకోవడానికి ఫిర్యాదుదారుడు ఇస్మాయిల్ రాత్రి సమయంలో మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ జరుగుతున్న మద్యం సిట్టింగ్ చూసి అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. విధుల్లో ఉండి, నిందితుడితో కలిసి మందు తాగుతారా? అంటూ హెడ్ కానిస్టేబుల్‌ను ఇస్మాయిల్ అక్కడికక్కడే నిలదీశాడు. అక్కడితో ఆగకుండా స్టేషన్‌లో జరుగుతున్న ఈ తతంగాన్నంతటినీ తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు.

న్యాయం చేయాల్సిన స్టేషన్‌లోనే అన్యాయం జరుగుతోందని గ్రహించిన ఇస్మాయిల్, వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. పోలీస్ స్టేషన్ లోపలే హెడ్ కానిస్టేబుల్ మద్యం తాగుతున్నాడనే వార్తతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ అర్థరాత్రి సమయంలోనే కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి, అక్కడ ఉన్న సిబ్బందిని, బాధితుడిని విచారించారు. బాధ్యతారాహిత్యంగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ పండరిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధం చేశారు. పీఎస్‌లోనే మద్యం సేవించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us