ప్రతీ మొక్కా బతకాలి. పచ్చదనం పెరగాలి. క్షీణించిన అడవులు మళ్లీ దట్టంగా అల్లుకోవాలి. ఈ లక్ష్యంతో తెలంగాణలో ఉద్యమంలా మొదలైన హరితహారం సత్ఫలితాలిస్తోంది. తెలంగాణ పచ్చదనం దేశానికి నమూనాగా నిలుస్తోంది. దేశంలోనే ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జి.సి.చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో. పచ్చదనంలో తెలంగాణనే ముందుందని చెప్పారు.
20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 150కోట్ల 23 లక్షల మొక్కలు నాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2019-20 సంవత్సరంలో 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంతరించిపోయిన అడవుల విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం చేపట్టింది.
పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపే లక్ష్యంగా 2015లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరువిడతల్లో రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల మొక్కలు నాటింది. మొక్కలు నాటటమే కాదు..వాటి సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. స్థానిక సంస్థలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసింది. మొక్కల సంరక్షణకు ప్రభుత్వ సిబ్బందిని జవాబుదారీగా చేయడంతో..చూస్తుండగానే మొక్కలు మానులవుతున్నాయి.
2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో హరితహారాన్ని ప్రారంభించారు తెలంగాణ సీఎం కేసీఆర్. 2016లో 46 కోట్ల మొక్కలు నాటారు. గ్రామాలు, పట్టణాలతో పాటు…అటవీ ప్రాంతంలోనూ మొక్కలు నాటేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు. హరితహారం కోసం ప్రత్యేక నర్సరీలు ఏర్పాటుచేసుకున్నారు. విద్యార్థుల్లో పచ్చదనంపై అవగాహన పెంచుతూ…మొక్కల పెంపకానికి ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ జన్మదినాన్ని కూడా కోటి వృక్షార్చన పేరుతో నిర్వహించి..పచ్చదనానికి పెద్దపీట వేశారు.