Hyderabad Beautician Harassed in Gulf: ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరుతో అమాయకులను బుట్టలో వేసుకుంటారు.. మంచి జీతం ఇస్తామంటూ, రాజభోగాలు ఆశజూపి తీసుకెళ్తారు. అక్కడికి చేరాక అసలు వెతలు మొదలవుతాయి. తాజాగా గల్ఫ్ చేరిన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ చిత్రవధ అనుభవించింది. వారి వేధింపులు భరించలేక, తనను స్వదేశంలోని కుటుంబసభ్యుల వద్దకు చేర్చాలంటూ వేడుకుంటుంది.
అటు పిల్లల పోషణకు.. ఇటు తల్లి వైద్యానికి డబ్బుల కోసం గల్ఫ్ వెళ్లిన పాతబస్తీ ఎన్ఎంగూడ ప్రాంతానికి చెందిన నుస్రత్ సుల్తానా అక్కడ కష్టాల్లో చిక్కుకొంది. తనను రక్షించాలంటూ బంధువులకు ఓ వీడియో ద్వారా తన బాధను వివరించింది. దీంతో తమ బిడ్డను ఎలాగైనా గల్ఫ్ చెర నుంచి విడిపించి స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.
మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగం కోసం నుస్రత్ ప్రయత్నాలు చేస్తుండగా… అబ్దుల్ రహ్మాన్ అనే ఏజెంటు తారసపడ్డాడు. బ్యూటీషి యన్ వీసాపై విదేశాల్లో బాగా సంపాదించుకోవచ్చని నమ్మించాడు. నెలకు 1,200 ఖతార్ రియాల్స్ (నెలకు సుమారు రూ.30వేలు) ఇస్తారని నమ్మబలికాడు. కష్టాలు తీరతాయని భావించిన నుస్రత్.. ఆ ఏజెంటు ద్వారా ఈ ఏడాది మార్చి 14న దోహాలో అడుగు పెట్టింది.
14 రోజుల పాటు అక్కడి హోటల్లో క్వారంటైన్ ముగించుకున్న తర్వాత అల్ ముంతసిర్ అనే ఏజెంటు కార్యాలయానికి చేరుకుంది. ఎక్కువ మంది కుటుంబసభ్యులున్న ఇంటికి పాచిపనికి ఆ ఏజెంటు పంపించాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు బెదిరిస్తూ.. జీతం ఇవ్వకుండా, సరైన ఆహారం పెట్టకుండా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ యువతి వీడియో ద్వారా పేర్కొంది. 2 నెలలపాటు పని చేసిన తర్వాత ఎలాగోలా ఆ ఇంటి నుంచి బయట పడింది.
మరోసారి ఏజెంటు కార్యాలయానికి చేరుకోగా.. ఈసారి మరో ఇంటికి పంపాడు. అక్కడా అదే పరిస్థితి. దీంతో తాను స్వదేశం వెళ్లిపోతానని వేడుకోగా.. ఆ ఏజెంటు రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. మూడు నెలల నుంచి ఆమె నరకయాతన పడుతోంది. పైగా లైంగిక వేధింపులకు గురవుతోంది. ఇక్కడి ఏజెంటును సంప్రదించగా అతను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని కుటుంబ సభ్యులు వాపోయారు. దీంతో ఆమెను రక్షించాలని విదేశాంగ శాఖకు లేఖ రాశామని కుటుంబ సభ్యులు వివరించారు.
Read Also… Drone strikes : జమ్ము – కాశ్మీర్ ఉగ్రవాదుల డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ హై-లెవెల్ మీటింగ్