సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు షాక్ ఇచ్చారు. చెత్త సేకరణ ఎక్కడికక్కడే నిలిపివేసి ఆందోళన బాట పట్టారు. స్వచ్ఛ ఆటో కార్మికులు స్ట్రైక్ ఎఫెక్ట్ తో 66 డివిజన్లలో చెత్త సేకరణ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో కాలనీలన్నీ దుర్గంధంతో కంపుకొడుతున్నాయి.
స్వచ్ఛ భారత్ సాంగ్ తో ఉదయాన్నే ప్రతీ గల్లీ గల్లీలో సందడి చేస్తూ… ఇంటింటి తలుపుతట్టి చెత్త సేకరించే కార్మికులు ఆందోళన బాట పట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న 169 స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరణ నిలిపి వేశారు. వారికి నాలుగు నెలల నుండి వేతనాలు రావడం లేదని.. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ స్వచ్ఛ ఆటోలతో నిరసన చేపట్టారు. GWMC పరిధిలో 66 డివిజన్లు ఉండగా 169 ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతుంది. వీరికి గత నాలుగు నెలల నుండి వేతనాలు రావడం లేదని ఆరోపించారు. ఈ ఈనేథ్యంలోనే విధులు బహిష్కరించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు స్వచ్ఛ ఆటోలతో ఆందోళన దిగారు.
66 డివిజన్ లలోని ప్రతీ ఇంట్లో చెత్త సేకరిస్తూ నగరం పరిశుభ్రంగా ఉంచుతున్న తమకు నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు..GWMC అధికారుల తీరు పట్ల ఆగ్రహ వ్యక్తం చేసిన స్వచ్ఛ ఆటో డ్రైవర్లు సమయానికి వేతనాలు ఇవ్వక పోవడంతో బ్యాంకు లోన్ ఆలస్యమై ఇతర లోన్లు రావడంలేదని గోడు వెళ్ళబోసుకున్నారు. గతంలో ఇంటికి 60 రూపాయల చెత్త పన్ను వసూలు చేసిస్తామన్న అధికారులు ఇప్పటివరకు అది పట్టించు కోవడంలేదని ఆరోపించారు. ఆటోల మెయింటెనెన్స్ కూడా మాకు భారంగా మారిందని, ఇక స్వచ్ఛ ఆటోలు నడిపే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
GWMC అధికారుల నిర్లక్షం వల్ల 169 మంది స్వచ్ఛ ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, అప్పటివరకు ఆటోలు తీసే ప్రసక్తే లేదని కార్మిక సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…