Telangana: రెండు ఎమ్మెల్సీలకు వేర్వేరుగా షెడ్యూల్.. ఎన్నికల సంఘం తీరుపై బీఆర్ఎస్ అభ్యంతరం..
ఓకే నోటిఫికేషన్ ఇస్తే ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక స్థానం కైవసం చేసుకోవచ్చని బీఆర్ఎస్ భావించింది. కానీ.. ఈ నిర్ణయంతో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. గతంలో ఒకే రోజున ఒకే నోటిఫికేషన్ ద్వారా కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాగా.. ఇప్పుడు ఉప ఎన్నికకు ఈసీ వేర్వేరుగా షెడ్యూల్ ఇచ్చారు..
తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దాంతో.. ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 29న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 65, బీఆర్ఎస్‌కు 39 మంది సభ్యుల బలం ఉంది. అయితే.. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వడంతో.. రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కే చాన్స్ ఉంది. నిజానికి.. ఓకే నోటిఫికేషన్ ఇస్తే ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక స్థానం కైవసం చేసుకోవచ్చని బీఆర్ఎస్ భావించింది. కానీ.. ఈ నిర్ణయంతో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. గతంలో ఒకే రోజున ఒకే నోటిఫికేషన్ ద్వారా కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాగా.. ఇప్పుడు ఉప ఎన్నికకు ఈసీ వేర్వేరుగా షెడ్యూల్ ఇవ్వడం ఎంటని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. ఎన్నికల సంఘం తీరు.. కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చేలా ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రేసులో ఉన్నది ఎవరంటే..?
ఇదిలావుంటే.. తెలంగాణ శాసనమండలిలో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు. దాంతో.. మండలిలో పట్టు కోసం వాగ్ధాటి కలిగిన నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ టికెట్ ప్రకటించి బీ ఫారం ఇవ్వకుండా ఆపేసిన చిన్నారెడ్డికి.. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది. చివరి వరకు టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ పార్టీకి విధేయుడిగా ఉండడంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది.
ఇక.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్‌కుమార్, ప్రొటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్యనాయక్‌తో పాటు.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్అలీ, మధుయాష్కీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు… రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కే దక్కనుండగా.. అందులో ఒకటి సీనియర్ నేత కోదండరామ్ దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి కోదండరామ్‌కు కీలక పదవి కన్ఫామ్ అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే.. కోదండరామ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..