Panchayat Elections: ఎన్నికల బరిలోంచి తప్పుకో.. లేదంటే లేపేస్తాం.. పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి వార్నింగ్!

మీరు సర్పంచ్ అభ్యర్థి మామ కదా.. ఎన్నికల్లో నామినేషన్ కంటే ముందే రెండు లక్షలు ఖర్చు చేశారు.. అక్రమంగా ఓటర్లను మభ్య పెడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు‌ నోటు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు. ఎన్నికల నుండి మీ కోడలును తప్పుకోమనండి లేదంటూ మీ అంతు చూస్తాం అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో సర్పంచ్ అభ్యర్థి మామను బెదిరించాడు. కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతోంది.

Panchayat Elections: ఎన్నికల బరిలోంచి తప్పుకో.. లేదంటే లేపేస్తాం.. పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి వార్నింగ్!
Tg News

Edited By: Anand T

Updated on: Dec 06, 2025 | 12:09 PM

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య పోరు ముదురుతుంది. తమకు ఆపోజిషన్ ఉన్న అభ్యర్థిని తప్పించేందుకు కొందరు వ్యక్తులు వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆసీఫాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. సర్పంచ్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని.. లేదంటే నీ అంతు చూస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్పంచ్ అభ్యర్థి మామ తలపై తుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై దళం పేరిట లేఖ ఇచ్చి అక్కడి నుంచి పారొపోచయాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఇలాంటి ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చింతల మానేపల్లి మండలం రణవెల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొమురం భీం జిల్లా చింతల మానపల్లి మండలం రణవెల్లి సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన జాడి దర్శన నామినేషన్ వేశారు. ఆమెకు బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతు ఇస్తున్నారు. అభ్యర్థి దర్శన మామ అయిన బాపు, ఆయన సోదరుడు ప్రకాశ్ తో కలిసి పశువులను మేపుకొని సాయంత్రం ఇంటికి తోలుకొస్తున్నారు. అదే సమయంలో స్కూటీపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి బాపు వద్దకు వెళ్లాడు. ‘అంకుల్ ఆగు.. మీరు రంజిత్ నాన్నే కదా’ అని అడిగాడు. ఆయన అవునని చెప్పడంతో.. అతని చేతిలో బెదిరింపు లేఖ పెట్టాడు.

‘సర్పంచ్ గా ఇప్పటికే రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. వెంటనే పోటీ నుంచి తప్పకోవాలి’ లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ తలపై తుపాకీ పెట్టి బెదిరించాడు. ఆ తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాపు. ఈ మేరకు కౌటాల సీఐ సంతోష్ కుమార్, ఎస్సై నరేశ్ శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిరోజు కావడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.