Telangana: ఇంటర్ విద్యార్ధులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు సూపర్ గుడ్ న్యూస్ అందించనుంది తెలంగాణ ఇంటర్ సంస్థ. స్టూడెంట్స్‌కి వెల్ కమ్ కిట్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫైల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జూన్ 1 నుంచి అమలు చేయాలని చూస్తున్నారు..

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచే కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా వెల్‌కమ్ కిట్‌ను ప్రవేశపెట్టాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, జూన్ 1న తరగతులు ప్రారంభమైన రోజే విద్యార్థుల చేతిలో ఈ కిట్ ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిట్‌లో యూనిఫాం, లెసన్ నోట్స్, లెసన్ మెటీరియల్, వర్క్‌బుక్స్‌ను ఒకే ప్యాకేజీలో ఇవ్వనున్నారు.
దీంతో కళాశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే విద్యార్థికి అవసరమైన చదువు సామాగ్రి సిద్ధంగా ఉండనుంది. ఈ పథకం అమలుకు సుమారు రూ.70 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా పథకం ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు అమల్లో ఉండటంతో, ఈ వెల్‌కమ్ కిట్‌కు అవసరమైన నిధులను కూడా అదే పథకం నుంచి మళ్లించాలని ప్రతిపాదించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇదే నిధులతో క్రీడా సామాగ్రి, ల్యాబ్‌లు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 1.80 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం త్వరలోనే లభిస్తుందన్న ఆశతో అమలు స్థాయిలో కూడా సన్నాహాలు జరుగుతున్నాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




