Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..ఆఫ్‌లైన్‌లోనూ వీటి దరఖాస్తుల స్వీకరణ

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రాజీయ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ఆఫ్‌లైన్‌లో కూడా ఈ దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించనుంది. ఆన్‌లైన్‌లో సమస్యలు ఎదుర్కొనే వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..ఆఫ్‌లైన్‌లోనూ వీటి దరఖాస్తుల స్వీకరణ
Rajiv Yuva Vikasam Scheme

Updated on: Apr 06, 2025 | 1:05 PM

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం అనే ప్రతిష్ఠాత్మక పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించనుంది. అయితే ఈ పథకం కోసం ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం..ఇకపై ఆఫ్‌లైన్‌లోనూ తీసుకునేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆఫ్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారి కోసం ప్రభుత్వం నమూనా దరఖాస్తులను విడుదల చేసింది. దరఖాస్తులో 27 అంశాలకు సంబంధించిన వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్‌కంతో పాటు దరఖాస్తుదారులు దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్‌ను కూడా యాడ్ చేయాల్సిం ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత.. ఆ పత్రాలను మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు (ఎంపీడీవో కార్యాలయం), మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, లేదా జోనల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సంబంధిత పత్రాలు అందజేయబడతాయి.

ఆఫ్‌లైన్ సౌలభ్యం ద్వారా ఎక్కువ మంది యువత ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏదైనా సందేహాలు ఉంటే, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులను సంప్రదించవచ్చని లేదా హెల్ప్‌లైన్ నంబర్ 040-23120334కు కాల్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

అయితే దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 5వరకు ఉన్న గడువును ప్రభుత్వం ఏప్రిల్ 15, వరకు పొడిగించబడింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల యువతకు రూ.50,000 నుంచి రూ.4 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..