రైతులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఉచితంగా విత్తనాలు.. ‘రైతు వేదిక’ ద్వారా పంపిణీ!

తెలంగాణలో పత్తి సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పత్తి ఉత్పాదకతను భారీగా పెంచడంతో పాటు సాగు నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన రైతులకు పూర్తి ఉచితంగా ‘బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను’ అందించే భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రైతులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఉచితంగా విత్తనాలు.. రైతు వేదిక ద్వారా పంపిణీ!
Free Cotton Seeds To Farmers

Edited By:

Updated on: Jul 03, 2026 | 12:23 PM

తెలంగాణలో పత్తి సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పత్తి ఉత్పాదకతను భారీగా పెంచడంతో పాటు సాగు నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన రైతులకు పూర్తి ఉచితంగా ‘బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను’ అందించే భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు సమకూరుస్తూ.. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ పత్తి ఉత్పాదకత పథకం (MCP) కింద ఈ విత్తనాల పంపిణీని చేపట్టారు.

ఆమోదం తెలిపిన కేంద్రం.. 19 జిల్లాల ఎంపిక!

రాష్ట్రంలో పత్తి రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పత్తి సాగుకు అత్యంత అనుకూలమైన వాతావరణం, భూములు ఉన్న 19 జిల్లాలను ఈ ప్రత్యేక ఉచిత విత్తనాల పంపిణీ పథకానికి ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్‌రెడ్డి అధికారులతో కలిసి తొలి విడత విత్తనాల పంపిణీ పోస్టర్లను ఆవిష్కరించి, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

రైతు వేదికల ద్వారా పంపిణీ.. ఆ జిల్లాలు ఇవే!

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దళారీల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు విత్తనాలు చేరేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఆయా గ్రామాల్లోని ‘రైతు వేదికల’ ద్వారానే ఈ ఉచిత విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద ఎంపికైన జిల్లాలు రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, జనగామ, వరంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల.

ఒక్కో రైతుకు 2.5 ఎకరాల వరకు లబ్ధి

చిన్న, సన్నకారు రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా ఈ పథకానికి అర్హులను నిర్ణయించారు. ఈ పథకం కింద అర్హులైన ఒక్కో రైతుకు గరిష్ఠంగా రెండున్నర ఎకరాల సాగుకు సరిపడా హైబ్రిడ్ విత్తనాలను పూర్తిగా ఉచితంగా ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50,950 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరి కోసం సుమారు 6.33 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో అదనంగా 1.27 లక్షల ఎకరాల్లో మేలు రకం పత్తి సాగు జరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రూ.57.02 కోట్ల సబ్సిడీ..!

రైతులపై పైసా భారం పడకుండా అమలు చేస్తున్న ఈ విత్తన పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.57.02 కోట్ల భారీ సబ్సిడీని భరిస్తున్నాయి. ఈ నిధులలో 60 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం (MCP పథకం కింద), మిగిలిన 40 శాతం వాటాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నాయి.

ఉచిత విత్తనాలతో పాటు మందులు కూడా..!

కేవలం పత్తి విత్తనాలే కాకుండా, పంట ఆరోగ్యకరంగా ఎదిగేందుకు అవసరమైన ‘ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు’, పర్యావరణానికి హాని చేయని ‘వేప నూనె ఆధారిత పురుగుమందుల’ను కూడా రైతులకు భారీ రాయితీ ధరలపై అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యమైన విత్తనాలు ఉచితంగా లభించడం, రాయితీపై పురుగుమందులు అందడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, తద్వారా పత్తి ఉత్పాదకత పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us