Rythu Bharosa: రైతు భరోసాపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్.. ఈ నెలలోనే ఖతాల్లోకి.. ఈ సారి..

తెలంగాణలోని రైతులకు తీపికబురు. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఎప్పటినుంచి రిలీజ్ చేస్తామనేది అధికారికంగా ప్రకటించారు. వానకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రాష్ట్రంలో పంట సాగు మొదలవుతోంది. దీంతో పెట్టుబడి సాయం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Rythu Bharosa: రైతు భరోసాపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్.. ఈ నెలలోనే ఖతాల్లోకి.. ఈ సారి..
Rythu Bharosa

Updated on: Jun 18, 2026 | 7:23 AM

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26వ తేదీన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఆ రోజున మధిరలో జరిగే సభలో ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విడుదల చేయనున్నారు. మధిరలో బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరతగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. నైరుతి రుతువవనాలు రాష్ట్రాన్ని తాకడంతో తొలకరి ప్రారంభమైంది. దీంతో రైతులు పంట సాగు చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

విడతల వారీగా జమ

తొలి రోజు ఎకరంలోపు పోలం ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఆ తర్వాత ఆ పైన వ్యవసాయ భూమి ఉన్నవారికి విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో వ్యవసాయ శాఖ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా జమ, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ యూనివర్సిటీ, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల జమ, బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ

ఈ నెల 26వ తేదీ నుంచి నిధుల జమ ప్రారంభమవుతుందని అధికారికంగా రేవంత్ వెల్లడించారు. వర్షాలు ప్రారంభమైన క్రమంలో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో సకాలంలో నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయనున్నామని, 1.50 కోట్ల ఎకరాలకు విడుదల చేసేందుకు రూ.9 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 18వ తేదీన జరిగే కార్యక్రమంలో నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం 26వ తేదీ నుంచి నిధుల జమ ప్రారంభం కానుంది. తొలిరోజు 73 లక్షల మంది రైతులకు అందించనున్నారు. ఇక సన్నరకాల వరిసాగు, కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఉపయోగపడేలా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా జరిగే కొనుగోళ్లను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.

Follow Us