Komaram Bheem: జల్ జంగిల్ జమీన్.. నిజాం రజాకార్ల పాలనకు ఎదురొడ్డి నిలిచిన జంగ్ సూరన్..

|

Sep 16, 2022 | 1:15 PM

Hyderabad Liberation Day: జల్ జంగిల్ జమీన్ కోసం అడవి బిడ్డల ఆత్మగౌరవం కోసం నిజాం రజాకార్ల పాలనకు ఎదురొడ్డి నిలిచిన విఫ్లవ వీరుల పురిటి గడ్డ ఆదిలాబాద్. గోండు బెబ్బులి కొమురంభీం , గోండ్వానా సింగం రాంజీ గోండు పోరాటాలతో పులకించిన నేల..

Komaram Bheem: జల్ జంగిల్ జమీన్.. నిజాం రజాకార్ల పాలనకు ఎదురొడ్డి నిలిచిన జంగ్ సూరన్..
Komaram Bheem
Follow us on

“బండెనుక బండికట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లే పొతవు కొడుకో నైజాం సర్కరోడా…” అంటూ తెలంగాణ యువతరం సాయుధ పోరు సాగించి భూస్వాముల వెన్నులో వణుకుపుట్టించింది. అడవి బిడ్డల మానప్రాణాలు హరించి, అడవి నేలను అడవిబిడ్డలకు దక్కకుండా చేసిన నిజాం తొత్తులను తుక్కు తుక్కు చేస్తూ మావనాటే మావ సర్కార్ అంటూ గర్జించింది గోండు బెబ్బులి. బడిసెలు, విల్లంబులు , బాణాలతో ఎదురు తిరిగిన గోండు రాజుల చేతిలో కొందరు దేశముఖ్‌లు, దొరలు, జాగిర్దార్లు, జమీందార్లు హతమవ్వగా మరికొందరు గడీలు విడిచి పట్టణాలకు పారిపోయారు. ఆ పోరాటంలో వెన్నుపోటుదారుల‌ కుట్రలకు గోండు బెబ్బులి నేలకొరిగింది. అయినా పోరాటం మాత్రం ఆగలేదు. తెలంగాణ విముక్తి వరకు సాగిన ఉద్యమంలో ఆ మహనీయుల పోరాటాన్ని అడుగడుగునా గుర్తు చేసుకుంటూ పోరు సాగించింది. ఇప్పటికీ సాగిస్తూనే ఉంది ఆదిలాబాద్ నేల.

అప్పటి ఆదిలాబాద్ ఇప్పటి ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి అడవుల కేంద్రంగా సాగిన గోండుల పోరు ఇప్పటికి ఈ నేలకు కొత్త పోరాటాన్ని నేర్పుతూనే ఉంది. అసఫ్‌జాహి రాజవంశానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని విప్లవ జ్వాలగా మండించేందుకు 1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం సంకేపల్లిలో గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించింది ఓ గోండు బెబ్బులి. అతడే కొమురంభీం. నిజాం సర్కార్ పాలనలో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తన తండ్రి మరణించడంతో కుటుంబంతో కలిసి కెరమెరి ప్రాంతంలోని సర్దాపూర్‌కు వలస వెళ్లింది భీమ్‌ కుటుంబం. ఆ సమయంలో సర్దాపూర్ ప్రాంతంలో నిజాం పాలన సాగుతుండగా దానికి వ్యతిరేకంగా గొరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి జల్, జంగిల్, జమీన్ పోరాటానికి శ్రీకారం చుట్టారు కొమరం భీం.

నిజాం అధికారాలు, చట్టాలు, న్యాయస్థానాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీల హక్కుల కోసం భీం చేసిన వీరోచిత పోరాటం అనిర్వచనీయం. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినాదించాడు భీం. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్క తాటిపై నడిపించి ఉద్యమాన్ని ఉథృతం చేశాడు.

ఆసిఫాబాద్, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించిన తీరు అద్భుతం. కానీ కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించిన నిజాం సైన్యం భీమ్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చింది. భీం సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరం భీం పోరాటాన్ని అణచివేసింది. కానీ ఆ తరువాత పోరాటం తెలంగాణ విమోచన స్ఫూర్తితో కొత్త దారి వెతుక్కుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం