తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగుతున్నాయి. శ్వేతపత్రాలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటు బీఆర్ఎస్ మధ్య రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.. ప్రాజెక్ట్‌లపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజమేంటో ప్రజలకు తెలియాలని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందంటూ విమర్శించారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారంటూ పేర్కొన్నారు. కావాలంటే దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మొత్తం లెక్కలు తీసి.. నిజానికి ఎంత ఖర్చయ్యిందో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు వివరించారు.
ముందుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. కాళేశ్వరం పూర్తి అంచనాలు ఇవ్వాలని.. ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లుగా సాగునీటిశాఖ.. కేసీఆర్ కుటుంబం ఆధీనంలో ఉందని.. కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టింది ఎవరంటూ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.. అప్పులను ఆదాయంగా చూపించారని కాగ్ చెప్పినట్లు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..