ట్రైనీ IPS కేసు: ఒకరిపైనే చర్యలా..? మాజీ CBI డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఎం. నాగేశ్వరరావు స్పందించారు. నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, సస్పెన్షన్‌ను పునఃసమీక్షించాలని కేంద్ర హోంశాఖను కోరుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రైనీ IPS కేసు: ఒకరిపైనే చర్యలా..? మాజీ CBI డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
Ips Probationer Uday Krishna Reddy

Updated on: Jul 21, 2026 | 5:57 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు స్పందించారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం జరిగేలా నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రేమ సంబంధం విఫలమైతే దానిని వెంటనే క్రిమినల్ కేసుగా పరిగణించకూడదని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కేసులోని వాస్తవాలను సాక్ష్యాధారాల ఆధారంగా పరిశీలించి, ఎలాంటి పక్షపాతం లేకుండా దర్యాప్తు జరగాలని సూచించారు.

అలాగే ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. పరస్పర అంగీకారంతో సంబంధం ఉన్నట్లు తేలితే, క్రమశిక్షణా చర్యలు ఇద్దరిపైనా ఒకే విధంగా ఉండాలని పేర్కొన్నారు. ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సమానత్వ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన కోరారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉదయ్‌కు శిక్షణ కొనసాగించే అవకాశం కల్పించాలని సూచించారు.

అదేవిధంగా ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీని కోరారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి కష్టపడి ఐపీఎస్ స్థాయికి చేరుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్థానం వేలాది మంది యువతకు స్ఫూర్తిదాయకమని నాగేశ్వరరావు తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. కేసులోని వాస్తవాలపై తుది నిర్ణయం దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తైన తర్వాతే వెలువడనుంది. ప్రస్తుతం ఇరుపక్షాల వాదనలు పరిశీలనలో ఉన్నందున అధికారిక విచారణ ఫలితాలే కీలకంగా మారనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us