
తెలంగాణలో వీధి కుక్కల హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు 100 వీధి కుక్కలను హతమార్చగా, మరో 50కి పైగా కుక్కలను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలపై యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలు నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మనపల్లి గ్రామ పరిధిలో దాదాపు 100 వీధి కుక్కలను హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ ఆదేశాల మేరకే ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరో ఘటనలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామం నుంచి సుమారు 50 వీధి కుక్కలను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనలపై స్పందించిన ఎన్‌జీవో ప్రతినిధులు, జంతు హక్కుల చట్టాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు. జంతువులపై క్రూరత్వం నివారణ చట్టానికి విరుద్ధంగా ఈ చర్యలు జరిగాయని తెలిపారు. ఈ మేరకు ముధావత్ ప్రీతి ఫిర్యాదు చేయగా చారపాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు వెల్లడైంది. అలాగే మరో ఫిర్యాదు భూమ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో దాఖలైనట్లు సమాచారం. ఈ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు ప్రక్రియలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీధి కుక్కల హత్యలు, అక్రమ తరలింపులపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌జీవోలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జంతు హక్కులపై చర్చకు దారితీస్తుండగా, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని పలు వర్గాలు కోరుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..