చూడటానికి మొక్కజొన్న పంటే అది.. కానీ దగ్గరకెళ్తే పరేషాన్‌ పక్కా!

వేసవిలో పంటలు పండించడం అంత సులువుకాదు. ముఖ్యంగా ఈ వేసవి రోజుల్లో కూరగాయ పంటలను ఎండ వేడి నుంచి కాపాడుకోవటానికి ఓ రైతు వినూత్న ప్రయత్నం చేశాడు. అటు కూరగాయల మొక్కలకు ఎండ నుంచి కాపాడటంతోపాటు.. కావాలన్సినంత నీటిని సమృద్ధిగా అందిస్తున్నాడా రైతు. ఏకకాలంలో రెండు, మూడు పంటలను పండిస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు..

చూడటానికి మొక్కజొన్న పంటే అది.. కానీ దగ్గరకెళ్తే పరేషాన్‌ పక్కా!
Farmer Cultivating Vegetables In An Innovative Way

Updated on: May 07, 2025 | 8:40 PM

నాగర్‌కర్నూలు, మే 7: నాగర్‌కర్నూలు జిల్లా చారుగొండ మండలం జూపల్లికి చెందిన  రైతు రంగప్రసాద్‌కు 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రంగప్రసాద్‌ తనకున్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న విత్తులు విత్తాడు. అది ఏపుగా పెరిగింది. ఆ విత్తనాలు పక్కనే టొమాటో మొక్కలు కూడా నాటాడు. ఇలా టొమాటో, మొక్కజొన్న తోడూ నీడగా ఎదగసాగాయి. ప్రస్తుతం వేసవి కావడంతో పక్కనే ఏపుగా పెరిగిన మొక్కజొన్న మొక్కలు టొమాటో మొక్కలకు కొండంత అండగా నిలిచాయి. మాడుపగినే ఎండల నుంచి టొమాటో తోటను కాపాడుకోవటానికి రైతు రంగప్రసాద్‌ ఈ వినూత్న ఉపాయం ఇది. దూరం నుంచి చేసే ఎవరికైనా అది మొక్కజొన్న తోటలాగే కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే.. చేనంతా పచ్చగా టొమాటో పంట కనిపిస్తుంది.

ఇలా వినూత్న పథంలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడితో మంచి లాభాలు గడిస్తున్న రంగప్రసాద్‌ గతంలో బ్యాంకింగ్‌ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేసేవారట. ఆయన నాలుగేళ్ల క్రితం ఉద్యోగం మనేసి సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. తనకున్న 70 ఎకరాల పొలంలో ఐఫామ్స్‌ను స్థాపించారు. రకరకాల పండ్ల చెట్లు, కూరగాయలు, నాటుకోళ్లు, మేకలు ఇలా రకరకాల పంటలు పండిస్తున్నారు. అంతేనా.. గచ్చిబౌలిలో సొంతంగా స్టోర్‌ తెరచి తన పొలంలో పండిన పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.

ఎండల దాటికి పంటలన్నీ ఎండిపోతున్న తరుణంలో రంగప్రసాద్‌ మాత్రం టొమాటో, క్యాబేజీ, బ్రకోలి, లెట్యూస్‌ వంటి పంటలు సాగుచేస్తున్నారు. అయితే ఆయన పండించే అన్ని పంటల్లోనూ ఉత్తర – దక్షిణ వరుసలుగా మొక్కజొన్న విత్తులు నాటారు. ఇలా ప్రతి 30 రోజులకోసారి కొత్త కూరగాయల ప్లాట్‌లో మొక్కలు నాటుతూ ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయల మొక్కలను నాటేటప్పుడే మొక్కజొన్న విత్తులు కూడా వరుసల మధ్య విత్తుతున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే మధ్యలో 15 రోజులకోసారి కూడా మొక్కజొన్న విత్తుతామని, అందువల్లనే తన పంట ఎప్పుడు చూసినా రకరకాల ఎత్తుల్లో మొక్కజొన్న మొక్కలు పెరుగుతూ కనిపిస్తాయన్నారు. ఇవి ఏపుగా పెరిగి వాటికి పక్కన ఉన్న కూరగాయ మొక్కలకు నీడను, చల్లదనాన్ని అందిస్తుండటంతో ఎండను తట్టుకొనే శక్తి వస్తోందని అన్నారు. తక్కువ కాలంలో ఏపుగా పెరిగే మొక్కజొన్నతో 3 డిగ్రీల సెల్షియస్‌ మేరకు పొలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని.. ఫలితంగా కూరగాయల మొక్కలు సమృద్ధిగా పంటను అందిస్తాయని, ఇదే తన సృజనాత్మకత అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.