Telangana: అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..

అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవాలని ఒక రైతు వేసిన ఉచ్చు.. మరో రైతు పాలిట మృత్యుపాశంగా మారింది. పక్క పొలం రైతు చేసిన చిన్న నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతు, కరెంటు తీగల రూపంలో పొంచి ఉన్న మృత్యువును గమనించలేకపోయాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది.

Telangana: అడవిపందుల కోసం కరెంట్ ఫెన్సింగ్.. ఉదయం పొలానికి వెళ్లి చూడగా..
Warangal Farmer Electrocution

Edited By:

Updated on: Mar 10, 2026 | 7:10 PM

పంటను కాపాడుకోవాలనే ఒక రైతు చేసిన పని.. మరో రైతు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అడవి పందుల నుండి మొక్కజొన్న చేనును రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు.. మరో రైతుకు యమపాశాలుగా మారాయి. వరంగల్ జిల్లా మొగిలిచర్ల గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మొగిలిచర్ల గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్ అనే రైతుకు కొత్తపేట గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. మంగళవారం తెల్లవారుజామున తన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి శ్రీనివాస్ పొలానికి వెళ్ళాడు. అయితే తన పొలం పక్కనే ఉన్న సాంబయ్య అనే రైతు తన మొక్కజొన్న చేనును అడవి పందుల నుండి కాపాడుకోవడానికి చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చాడు. చీకటిలో ఆ విద్యుత్ వైర్లను గమనించని శ్రీనివాస్, ప్రమాదవశాత్తు వాటిని తాకాడు. హైవోల్టేజ్ కరెంటు షాక్ తగలడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

రైతు ఇంటి ముందు మృతదేహంతో ధర్నా

శ్రీనివాస్ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సాంబయ్య చేసిన నిర్లక్ష్యపు పనే శ్రీనివాస్ ప్రాణాలు తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ మృతదేహాన్ని నిందితుడైన సాంబయ్య ఇంటి ముందుకు తీసుకెళ్లి ధర్నా నిర్వహించారు. పంట కోసం పెట్టిన తీగలు మనిషి ప్రాణం తీస్తాయా? మాకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ బాధితులు బోరున విలపించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

సమాచారం అందుకున్న ఎనుమాముల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు సాంబయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పంటల రక్షణ కోసం పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలు మూగజీవాలకే కాకుండా, తోటి మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయి. రైతులు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి ప్రమాదకర పద్ధతులకు స్వస్తి పలకాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow Us