పెను విషాదం.. వారి ఆయుష్షు గట్టిదై వట్టి గాయాలతో బయటపడ్డారు. 30 ఫీట్ల లోతు బావిలో పీకల్లోతు మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు చివరకు మృత్యుంజయులయ్యారు. వారిని కాపాడేందుకు పోలీసులు, గ్రామస్తులు పెద్ద సాహసమే చేశారు. అసలేం జరిగింది..? అయ్యో పాపం అనిపించే ఆ విషాద సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గాంధీపురం గ్రామశివారులో ఈ విషాద సంఘటన జరిగింది..వ్యవసాయ బావి తవ్వుతున్న క్రమంలో దరి పక్కనున్న మట్టి దిబ్బలు ఒకసారిగా కూలాయి. ఆ మట్టి దిబ్బలు బావిలో పనిచేస్తున్న సుధాకర్, నరేష్ అనే వ్యక్తులపైన పడిపోయాయి. దీంతో ఆ ఇద్దరు పీకల్లోతు వరకు మట్టిలో కూరుకు పోయారు. దిక్కుతోచని స్థితిలో ఆర్తనాదాలు చేశారు.
వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న సహాయక బృందం పెద్ద సాహసమే చేసింది. జేసీబీ సహాయంతో బావిలోకి దిగి మట్టిలో కూరుకుపోయిన ఇద్దరిని ప్రాణాలతో బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు తాళ్ల పూసపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతుతో పాటు, నరేష్ అనే కూలీగా గుర్తించారు. బావిలోకి దిగి మట్టితీసే సమయంలో మట్టి దిబ్బలు ఒకసారిగా కులాయి. దీంతో మెడ భాగం వరకు మట్టిలో ఇద్దరు కూరుకుపోయారు. వీరితో ఉన్న జాటోత్ వెంకన్న అనేవ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సకాలంలో స్పందించారు.
స్థానికులు వారిని కాపాడేందుకు పెద్ద సాహసం చేసి బావిలోకి దిగి పారల సాయంతో మట్టి తవ్వి ఆ ఇద్దరిని చివరకు బయటకు తీశారు. కాగా, ఈ ఘటనలో నరేష్ అనే కూలీకి కాలు విరిగి పోగా సుధాకర్ అనే రైతుకు స్వల్ప గాయాలయ్యాయి. మృత్యుంజయులు అయిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితి ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…